HANUMANTHA VAHANAM OBSERVED_ హనుమంత వాహనంపై శ్రీ పసన్న రాముడు అభయం

Appalayagunta, 28 June 2018: Lord Sri Prasanna Venkateswara Swmay took celestial ride on Hanumantha Vahanam on the sixth day of ongoing annual brahmotsavams at Appalayagunta.

In the guise of Jagadabhi Rama, the Lord blessed His devotees on Thursday morning.

Hanumantha Vahana signifies the loyalty of a devotee towards his Master.

Temple Special Grade DyEO Sri Munirathnam Reddy, AEO Sri Subrahmanyam, Superintendent Sri Gopala krishna Reddy took part in the fete.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హనుమంత వాహనంపై శ్రీ పసన్న రాముడు అభయం

తిరుపతి, 2018 జూన్‌ 28: అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ ప్రసన్న రాముడై హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనసేవ ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు ఉదయం స్వామివారు వరదహస్తం దాల్చిన ప్రసన్న రాముడై హనుమంతునిపై ఆసీనుడై భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించాడు. భవిష్యోత్తర పురాణంలోని వేంకటాచల మహత్మ్యంలో శ్రీవారు వేంచేసిన పుట్ట – కౌసల్య, చింతచెట్టు – దశరథుడు, శేషాచలం – లక్ష్మణుడు, పర్వతప్రాంతం – అయోధ్య అని పేర్కొనబడింది. శ్రీరాముడు హనుమంతుని భుజస్కంధాలపై అధిరోహించిన సన్నివేశాలు శ్రీమద్రామాయణంలో ఉన్నాయి. ఈ ఉత్సవంలో వాహనంగా హనుమంతుడిని, వాహనాన్ని అధిష్టించిన కల్యాణ వేంకటరాముడిని దర్శించడం వల్ల భోగమోక్షాలు, జ్ఞానవిజ్ఞానాలు, అభయారోగ్యాలు కలుగుతాయి.

అనంతరం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం 3.00 నుండి 5.00 గంటల వరకు ఆలయంలో వసంతోత్సవం, గ్రామోత్సవం వైభవంగా జరుగనుంది.

కాగా రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు శ్రీవారు ఆరో రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతాడు. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతం. స్వామి ప్రణవరూపుడు, విశ్వాకారుడూ, విశ్వాధారుడూ కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచితం. ఈ ఉత్సవం మనలోని అహంకారం తొలగితే మనపై రక్షకుడుగా భగవంతుడుంటాడనే సంగతి గుర్తు చేస్తుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమునిరత్నంరెడ్డి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణా, కంకణభట్టార్‌ శ్రీసూర్యకుమార్‌ ఆచార్యులు, ఎవిఎస్వో శ్రీ పార్థసారధిరెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.