అమ్మవారి బ్రహ్మోత్సవాలలో పారిశుద్ధ్యానికి పెద్ద పీట

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వ్యాసం

అమ్మవారి బ్రహ్మోత్సవాలలో పారిశుద్ధ్యానికి పెద్ద పీట

నిరంతరం భక్తుల సేవలో టిటిడి ఆరోగ్యవిభాగం

తిరుపతి, 2018 డిసెంబరు 10 సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలో భాగంగా అమ్మవారి ఆలయం, నాలుగు మాడవీధులు, ఆస్థాన మండపం, పరిసర ప్రాంతాలలో టిటిడి ఆరోగ్య విభాగం నిరంతరం భక్తుల సేవలో తరిస్తోంది.

ఈ విభాగంలోని సిబ్బంది పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, పాదరక్షల కౌంటర్‌ నిర్వహణ, తాగునీటి పంపిణీ తదితర పనులను చేపడుతున్నారు. అంకితభావంతో విధులు నిర్వహిస్తు అధికారులతో పాటు భక్తుల మన్ననలు అందుకుంటున్నారు.

తిరుచానూరులో మొత్తం 300 మంది ఆరోగ్య విభాగం సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో సీనియర్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, 12 మంది శానిటరీ మేస్త్రీలు, సులభ్‌ సూపర్‌వైజర్లు, సులభ్‌ కార్మికులు ఉన్నారు. వీరు రోజుకు మూడు షిప్టుల్లో 24 గంటల పాటు సేవలందిస్తున్నారు. ప్రత్యేకంగా గజవాహనం నాడు 100 మంది అదనపు సిబ్బందితో కలిపి మొత్తం 400 మంది పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. అదేవిధంగా మంగళవారం నిర్వహించే రథోత్సవానికి 50 మంది అదనపు సిబ్బందితో కలిపి మొత్తం 350 మంది పారిశుద్ధ్య పనులు నిర్వహించనున్నారు.

అమ్మవారి ఆలయం, నాలుగుమాడ వీధులు, తోళప్ప గార్డెన్స్‌, శుక్రవారపు తోటలోని పుష్ప ప్రదర్శనలో, పార్కింగ్‌ ప్రాంతాలలో చెత్తను తొలగించడం, పరిసరాలను నీటితో తడపడం, క్యూలైన్లలో, ఆలయం వద్ద పారిశుద్ధ్యం నిర్వహణ తదితర పనులు చేపడుతున్నారు. అంతేగాక జంతు సంరక్షణ వారి సహకారంతో నాలుగు మాడ వీధులలో కుక్కల సంచారం లేకుండా చేస్తున్నారు. పంచాయతి వారి సహకారంతో గ్రామంలోని పశువులను గోశాలలో వుంచి దాణా అందిస్తున్నారు. అంటురోగాలు ప్రబలకుండా ఫినాయిల్‌, బ్లీచింగ్‌, ఫాగింగ్‌, నువాన్‌ స్ప్రే చేస్తున్నారు.

పంచమి తీర్థానికి విస్తృత ఏర్పాట్లు :

బుధవారం ఉదయం జరగనున్న పంచమి తీర్థానికి టిటిడి ఆరోగ్య విభాగం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఇందుకుగాను 600 మంది పారిశుద్ధ్య సిబ్బందిని అదనంగా నియమించింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, పార్కింగ్‌ ప్రాంతాలలో 314 తాత్కలిక, మొబైల్‌ టాయిలెట్లు భక్తులకు అందుబాటులో ఉంచింది. వాటర్‌ వర్క్స్‌ విభాగం వారికి సహకరిస్తు భక్తులకు సేవలందిస్తున్నారు. అమ్మవారి పంచమి తీర్థాన్ని పురస్కరించుకుని తిరుమల నుండి తిరుచానూరుకు శ్రీవారి సారెను తీసుకువచ్చే మార్గంలో సీనియర్‌ శానిటరీ ఇన్‌స్పెక్టరు, నలుగురు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సులభ్‌ కార్మికులు పారిశద్ధ్య పనులు నిర్వహించనున్నారు.

ప్రత్యేకంగా పంచమి తీర్థానికి విచ్చేసే భక్తులకు 2 లక్షల వాటర్‌ బాటిల్స్‌ను టిటిడి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నారు.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆదేశాల మేరకు ఆరోగ్యవిభాగం అధికారి డా|| సునీల్‌ కుమార్‌ పర్యవేక్షణలో యూనిట్‌ అధికారి శ్రీ పి.అమరనాథరెడ్డి అధ్వర్యంలో ఆరోగ్య విభాగం సిబ్బంది విశేషంగా సేవలు అందిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.