KUMARADHARA MUKKOTI AND POURNAMI GARUDA SEVA IN TIRUMALA ON FEBRUARY 19
Tirumala, 18 February 2019: The annual Kumaradhara Mukkoti will take place in Tirumala on February 19.
This torrent festival usually falls on the auspicious day of Magha Pournami.
The monthly Pournami Garuda Seva will also be observed by TTD on the same day evening between 7pm and 9pm.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఫిబ్రవరి 19న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి
ఫిబ్రవరి 18, తిరుమల, 2019: తిరుమలలో ఫిబ్రవరి 19వ తేదీన మంగళవారం శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా జరుగనుంది. కుంభ మాసం, ముఖా నక్షత్రంలో పౌర్ణమినాడు ఈ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన భక్తులు తీర్థ స్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ కుమారధార తీర్థంలో స్నానమాచరించడాన్ని భక్తులు ప్రత్యేకంగా భావిస్తారు.
వరాహ, మార్కండేయ పురాణాల ప్రకారం ఒక వృద్ధ బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు. శ్రీవేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షమై ”ఈ వయసులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు.. అడవిలో ఏంచేస్తున్నావు” అని ప్రశ్నించారు. యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు బదులిచ్చాడు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమాచరించగా 16 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి ‘కుమార ధార’ అనే పేరు వచ్చింది.
పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోకం సేనాధిపతి కుమారస్వామి రాక్షసుడైన తారకాసురుడి సంహారం తరువాత శాపవిమోచనం కోసం ప్రయత్నించాడు. శివుని సూచన మేరకు శేషాచల పర్వతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాపవిమోచనం పొందాడు. సాక్షాత్తు కుమారస్వామివారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి ‘కుమారధార’ అనే పేరు స్థిరపడింది.
ఫిబ్రవరి 19న పౌర్ణమి గరుడసేవ
తిరుమలలో ఫిబ్రవరి 19వ తేదీన మంగళవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.