LORD RIDES SIMHA VAHANAM IN NARASIMHA AVATAR_ సింహ వాహనంపై యోగ నరసింహుని అవతారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి

Appalayagunta, 15 Jun. 19: On day-3 Of ongoing annual Brahmotsavams of Sri Prasanna Venkateswara temple, Appalayagunta, Lord rode Simha vahanam in Narasimha alankaram and blessed devotees.

The grand spectacle on mada streets led by bhajan and kolata teams and Mangala Vaidya and enthralled the devotees.

Legends say that Lords ride on Simha vahanam signalled the agenda to punish evildoers. Later in the evening, Lord rode on muthyapu pandiri vahanam in Bakasura Vadha avatar signalling promotion of tranquillity and peace in the universe.

On Sunday, June 16, grand Kalyanotsavam will be conducted in which interested devotees could participate with ₹500 tickets for couple and beget one uttarium, one blouse, one laddu, one appam and Anna Prasadams.

TTD DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Superintendent Sri Gopalakrishna.kankana bhattar Sri Surya Kumar Acharyulu, temple inspector Sri Srinivasulu and others participated.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సింహ వాహనంపై యోగ నరసింహుని అవతారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి

తిరుపతి,2019 జూన్ 15: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శ‌నివారం ఉదయం అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ నరసింహుని అవతారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహంపై కూర్చొని ఊరేగుతారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతాలవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపిస్తున్నారు.

ముత్య‌పుపందిరి వాహనంపై బ‌కాసుర‌వ‌ధ‌ అవతారంలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు -కాగా శ‌నివారం రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు బ‌కాసుర‌వ‌ధ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళయే అనుకూలం. అందుకే కల్యాణ శ్రీనివాసునికి మూడో రోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్ని పెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. మాంసమయమైన ఈ శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి మిక్కిలి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.

జూన్ 16న శ్రీ పసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం

జూన్ 16వ తేదీ ఆదివారం సాయంత్రం 5.00 నుండి 7.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణా, కంకణభట్టార్‌ శ్రీసూర్యకుమార్‌ ఆచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.