అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి పుష్పయాగ మహోత్సవము పోస్టర్లను ఆవిష్కరించిన తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI
అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి పుష్పయాగ మహోత్సవము పోస్టర్లను ఆవిష్కరించిన తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్
తిరుపతి, 2019 జూలై 09: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 18వ తేదీన జరుగనున్న పుష్పయాగ మహోత్సవం పోస్టర్లను టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.బసంత్‌కుమార్ మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ జూలై 17వ తేదీ బుధవారం సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.30 గంటల వరకు అంకురార్పణం జరుగనుందని తెలిపారు.
జూలై 18వ తేదీ ఉదయం 10.30 గంటలకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 3.00 నుంచి 6.00 గంటల వరకు పుష్పయాగ మహోత్సవము, సాయంత్రం 6.30 గంటలకు వీధి ఉత్సవం జరుగనున్నాయని జెఈవో తెలిపారు. పుష్పయాగంలో వివిధ రకాల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తారని వివరించారు.
జూన్ 13 నుండి 21వ తేదీ వరకు వరకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయని, ఈ ఉత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శ్రీనివాసులు, శ్రీ రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.