TTD CHAIRMAN UNVEILS POSTERS OF THALLAPAKA TEMPLE BRAHMTOSAVAMS _ తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించిన టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు

తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించిన టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు

జూలై 06 నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2025, జూన్ 26: టిటిడికి అనుబంధంగా ఉన్న తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. ఈ మేరకు తిరుమలలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో గురువారం టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలసి ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 06 నుండి 15వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ రెండు ఆలయాల బ్రహ్మోత్సవాలకు జూలై 05వ తేదీ అంకురార్పణ జరుగనుంది.

శ్రీ చెన్నకేశవస్వామివారి వాహనసేవలు :

జూలై 06న ఉదయం 9 నుండి 10 గంటల మధ్య సింహ లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి శేషవాహన సేవ నిర్వహిస్తారు. జూలై 07న ఉదయం పల్లకీ సేవ, రాత్రి హంస వాహనం, జూలై 08న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహ వాహనం, జూలై 09న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి హనుమంత వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు. జూలై 10న ఉదయం మోహినీ అవతారం, గరుడసేవ నిర్వహిస్తారు.

జూలై 11వ తేదీ సాయంత్రం 06 నుండి ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 8.30 గంటలకు గజ వాహనంపై స్వామివారు విహరిస్తారు. జూలై 12న సాయంత్రం 6.00 గంటలకు రథోత్సవం, జూలై 13న రాత్రి అశ్వవాహనం, జూలై 14న ఉదయం 9 – 10.15 గం.ల మధ్య చక్రస్నానం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వాహనసేవలు :

జూలై 06న ఉదయం 6.16 గం.లకు ధ్వజారోహణంతో బ్రహ్మో త్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 6 గం.లకు హంసవాహన సేవ నిర్వహిస్తారు. జూలై 07న ఉదయం పల్లకీ సేవ, రాత్రి చంద్రప్రభ వాహనం, జూలై 08న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి చిన్నశేష వాహనం, జూలై 09న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహ వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు.

జూలై 10న ఉదయం పల్లకీ సేవ రాత్రికి నంది వాహనం జరుగనుంది. జూలై 11న సాయంత్రం 06.00 గం.లకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 07.30 గంటలకు గజవాహనంపై స్వామివారు విహరించనున్నారు. జూలై 12న సాయంత్రం పల్లకీ సేవ, జూలై 13న సాయంత్రం 06.00 గంటలకు పార్వేట ఉత్సవం, జూలై 14న ఉదయం 10.00 – 12 గం.ల మధ్య వసంతోత్సవం, త్రిశూలస్నానం, సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

జూలై 15వ తేదీన ఉదయం 9 గంటలకు శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీసిద్ధేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 06 – 08 గం.ల మధ్య పుష్పయాగం ఘనంగా జరుగనుంది.

బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, శ్రీమతి ప్రశాంతి పాల్గొన్నారు.

టి.టి.డి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.