SAKSHATKARA VAIBHAVOTSAVAMS FROM JUNE 24 TO 26 IN SRINIVASA MANGAPURAM _ జూన్ 24 నుండి 26వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు

TIRUPATI, 10 JUNE 2023: The annual three day Sakshatkara Vaibhavotsavams will be observed in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram between June 24 to 26 while the Koil Alwar Tirumanjanam will be performed on June 22.

Every day there will be Snapana Tirumanjanam to the Utsava deities Sri Bhu sameta Sri Kalyana Venkateswara Swamy between 10am and 11am while in the evening of first day, Pedda Sesha, second day Hanumantha and on the last day Garuda Vahanams will be performed between 7pm and 8pm.

PARUVETA UTSAVAM ON JUNE 27:

After the three day annual fete, Paruveta Utsavam will be observed on June 27 at the Paruveta Mandapam located near Srivari Mettu. 

In connection with these festivities, TTD has cancelled Tiruppavada Seva on June 22, Arjita Kalyanotsavam from June 24 to 27.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
జూన్ 24 నుండి 26వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు 
 
తిరుపతి, 2023 జూన్‌ 10: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జూన్ 24 నుండి 26వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.
 
ఈ సందర్భంగా జూన్ 22వ తేదీన ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. 
 
ఇందులో భాగంగా మూడు రోజులపాటు ఉదయం 10 నుండి 11 గంటల వరకు  శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. 
 
జూన్ 24న పెద్ద శేష వాహనం, జూన్ 25న హనుమంత వాహనం, జూన్ 26న గరుడ వాహనంపై స్వామివారు  రాత్రి 7 నుండి 8 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
 
జూన్ 27న పార్వేట ఉత్సవం : 
 
శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజైన జూన్ 27వ తేదీన పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 7 నుండి  ఈ ఉత్సవం నిర్వహిస్తారు.  ఈ సందర్భంగా ప్రత్యేక ఆస్థానం, పార్వేట ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు.
 
ఆర్జిత సేవలు రద్దు :
 
జూన్ 22వ తేదీన తిరుప్పావడసేవ, జూన్ 24 నుండి 27వ తేదీ వరకు ఆర్జిత కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.
 
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
 
చారిత్రక ప్రాశస్త్యం :
 
క్రీ.శ 14వ శతాబ్దం నుండి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు ప్రారంభమైనట్టు శాసనాధారాల ప్రకారం తెలుస్తోంది.
 
 క్రీ.శ 1433వ సంవత్సరంలో చంద్రగిరిని పాలించిన విజయనగర రాజుల వంశానికి చెందిన రెండవ దేవరాయ తిరుమలలో క్రమపద్ధతిలో వేదపారాయణం చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఇది బహుళ ప్రజాదరణ పొందింది. ఈ విషయాన్ని ఆలయాధికారి తెలుసుకుని సిద్ధకోట్టై అని పిలవబడే శ్రీనివాసపురానికి(ఇప్పుడు శ్రీనివాసమంగాపురం) చెందిన 24 మంది మహాజనులను స్వామివారి ఆస్థానంలో వేదాలను పారాయణం చేసేందుకు నియమించారు. దీనికి ఆమోదం తెలిపిన రాజుగారు ఇందుకయ్యే ఖర్చు కోసం తన రాజ్య పరిధిలోని సిద్ధకోట్టై గ్రామం నుండి రాజ్య భాండాగారానికి వచ్చే సొమ్ములో అర్ధ భాగాన్ని మంజూరు చేశారు.
 
అనంతరం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల మనవడైన శ్రీ తాళ్లపాక చిన తిరుమలాచార్యులు శ్రీ కళ్యాణ వేంకటేశ్వరుడి ఆలయానికి జీర్ణోద్ధరణ చేసి స్వామివారికి పూజలను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో క్రీ.శ 1540లో చంద్రగిరిని పాలించే అచ్యుతరాయలు మంగాపురం గ్రామాన్ని సర్వమాన్య అగ్రహారం(పన్నులేని భూమి)గా శ్రీ తాళ్లపాక చిన తిరుమలాచార్యులకు అందజేశారు.
 
అనంతరం క్రీ.శ 1780లో ముస్లిం రాజులు ఈ ఆలయాన్ని లూటీ చేశారు. ఆలయ ప్రధాన రాజగోపురం, గర్భాలయ గోపురం, విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేశారు. పాక్షికంగా ధ్వంసమైన కొన్ని విగ్రహాలు ప్రస్తుతం చంద్రగిరికోటలో భారత ప్రభుత్వ పురావస్తు శాఖ సంరక్షణలో ఉన్నాయి. 1920వ సంవత్సరంలో బ్రిటీషు ప్రభుత్వం ఈ ఆలయాన్ని జాతీయ పురాతన కట్టడంగా గుర్తించి భారత ప్రభుత్వ పురావస్తు శాఖ పరిధిలోకి తెచ్చింది. అప్పటి నుండి ఈ ఆలయం భారత ప్రభుత్వ పురావస్తు శాఖ రక్షిత కట్టడాల జాబితాలో ఉంది.
 
అనంతరం 1940వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం కాంచీపురానికి చెందిన మధ్వ బ్రాహ్మణుడు సుందరరాజ మంగాపురానికి వచ్చి శ్రీనివాసుడు తనకు కలలో కనిపించాడని తెలిపారు. ”శ్రీనివాసమంగాపురంలో ఉన్న నాకు ధూపదీప నైవేద్యాలు కరువయ్యాయి. నా ఆలయానికి పూర్వ వైభవం కల్పించు” అని స్వామి ఆదేశించారని వివరించారు.
 
తరువాత గ్రామపెద్దలైన వెంకటకృష్ణయ్య, నరసింగాపురం రెడ్డివారి నాధమునిరెడ్డి, గుర్రప్ప ఆచారి మరియు తొండవాడ మొగిలి సుందరరామిరెడ్డి తదితరులను సుందరరాజ కలిసి స్వామివారు తనకు కలలో కనిపించిన విషయాన్ని వివరించి సాయం చేయాలని కోరారు. ఆ సమయంలో ఆలయం మొత్తం ముళ్లపొదలు, చీమలపుట్టలు, విషపు కీటకాలు, పాములతో నిండి గోపురాలు కూలిపోయే స్థితిలో ఉండేది. గ్రామపెద్దల సాయంతో సుందరరాజ ముళ్లపొదలు, చీమలపుట్టలను తొలగించి ఆలయాన్ని పరిశుభ్రం చేశారు. స్వామివారు కలలో సూచించిన విధంగా 1940 జులై 11న ఆషాడ శుద్ధ షష్ఠి రోజున తొలిపూజ చేశారు.
 
అదేవిధంగా అర్చకుడైన సుందరరాజకు స్వామివారు కలలో కనిపించి చెప్పిన విధంగా టీటీడీ అప్పటినుండి నిత్యపూజా కైంకర్యాలు నిర్వహిస్తోంది. అలాగే మొదటి పూజను నిర్వహించిన ఆషాడ శుద్ధ షష్ఠి రోజున ”సాక్షాత్కార వైభవం” పేరిట టీటీడీ ప్రతి ఏడాదీ ఉత్సవం నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాన్ని బ్రహ్మోత్సవాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి టీటీడీ నిర్వహిస్తుండడం విశేషం.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.