SALAKATLA ANIVARA ASTHANAM IN TIRUMALA _ జులై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం

TIRUMALA, 11 JULY 2021: The annual budget festival in Tirumala temple, salakatla Anivara Asthanam will be observed on July 16.

The uniqueness about this fete is that the previous year’s accounts of the office are presented before the deity by the principal officers and are taken back to signify that Srivaru finds the officers fit enough to hold the office in their respective capacities.

New books will also be issued for recording finances of the next fiscal.

In the Agamic jargon, the entire process is called Asthanam which will be performed inside sanctum sanctorum near Bangaru Vakili in the presence of processional deities of Sri Malayappa Swamy and His two consorts Sridevi and Bhudevi on Sarvabhoopala Vahanam accompanied by Viswaksena seated on another platform.

In connection with this fete, TTD has cancelled all arjitha virtual sevas including Kalyanotsavam, Unjal seva, Arjita Brahmotsavam, Vasanthotsavam, Sahasra Deeplankara seva on that day.

The procession of Pushpa Pallaki will take place in the evening on that day at 6pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జులై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం

 తిరుమల, 2021, జులై 11: తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16వ తేదీ శుక్ర‌వారంనాడు సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరుగనుంది.

చారిత్రక నేపథ్యం :

సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజున అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్‌ నెలలకు మార్చారు.

ఆర్జితసేవలు రద్దు :

జూలై 16న ఆణివార ఆస్థానం కారణంగా వ‌ర్చువ‌ల్ సేవ‌లైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

ఉత్సవ విశిష్టత :

ఈ ఉత్సవం రోజున ఉదయం బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదిస్తారు.

జీయ్యంగార్ల వస్త్ర సమర్పణ :

శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగార్‌ పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారు. వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరిస్తారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో ”పరివట్టం”(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి  ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదిస్తారు.

ఆ తరువాత అర్చకులు శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగారికి, టిటిడి తరఫున కార్యనిర్వహణాధికారికి ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలిస్తారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాలచెంత ఉంచుతారు.

పుష్ప పల్లకీపై ఊరేగింపు :

 ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.