SPIRITUAL GUIDANCE TO THE SOCIETY IS POSSIBLE THROUGH BHAGAVAD GITA; HDPP SECRETARY _ భగవద్గీతతో సమాజానికి ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం : డిపిపి కార్యదర్శి శ్రీ రఘునాథ్
భగవద్గీతతో సమాజానికి ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం : డిపిపి కార్యదర్శి శ్రీ రఘునాథ్
• విజేతలకు బహుమతులు ప్రదానం
తిరుపతి, 2024 డిసెంబర్ 11: ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం ద్వారా సమాజాన్ని సన్మార్గంలో నడిపే శక్తి భగవద్గీతకు ఉందని డిపిపి కార్యదర్శి శ్రీ రఘునాథ్ అన్నారు. టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భగవద్గీత శ్లోకాల కంఠస్తం పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బుధవారం సాయంత్రం బహుమతుల ప్రదానోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు సమాజంలో ఆధ్యాత్మిక కోణంలో ఎలా జీవించాలో భగవద్గీత తెలియజేస్తుందన్నారు. చెడు మీద మంచి విజయం సాధించడమే గీతా సారాంశమని తెలిపారు. చిన్న వయస్సులోనే భగవద్గీత శ్లోకాలను శాస్త్రబద్ధంగా పఠించడం, దానిలోని సందేశం అర్థం చేసుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారన్నారు.
భగవద్గీతలో 7వ అధ్యాయమైన శ్రద్దాత్రయ విభాగ యోగంపై 6 మరియు 7 తరగతులు ఒక విభాగంగాను, 8 మరియు 9 తరగతులు మరో విభాగంగాను ఈ పోటీలు జరిగాయి. అలాగే 700 శ్లోకాల సంపూర్ణ భగవద్గీత కంఠస్థ విభాగంలో 18 సంవత్సరాల వయసు పైబడిన వారు, 18 సంవత్సరాల లోపు వారికి వేరువేరుగా పోటీలు జరిగాయి.
ఈ నాలుగు విభాగాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ రఘునాథ్ బహుమతులు ప్రదానం చేశారు.
అంతకుముందు తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీ ఆచార్యులు శ్రీ చక్రవర్తి రాఘవన్, శ్రీ సముద్రాల దశరథ్, శ్రీ రామకృష్ణ శేష సాయి, శ్రీమతి సునీత, శ్రీ శేఖర్ రెడ్డి, శ్రీ శ్రీనివాసరావు, శ్రీమతి భాగ్యలక్ష్మి గీతా వైశిష్ట్యంపై ఉపన్యసించారు.
హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శ్రీమతి కోకిల, విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
పోటీల్లో పాల్గొన్న పలువురు విజేతలు, విద్యార్థుల స్పందన : శ్రీ ముకుంద – 8వ తరగతి విద్యార్థి
తిరుపతి లిటిల్ ఏంజెల్స్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్న శ్రీ ముకుంద్ మాట్లాడుతూ, భగవద్గీత పారాయణంతో చదువుపై ఏకాగ్రత పెరుగుతుందన్నారు. పెద్దలను గౌరవించడం, ఎవరితో ఎలా ఉండాలో తెలుస్తుందన్నారు.
శ్రీనివాస్ – 4వ తరగతి విద్యార్థి
తిరుపతి లిటిల్ ఏంజెల్స్ హై స్కూల్ 4వ తరగతి విద్యార్థి శ్రీనివాస్ మాట్లాడుతూ, కరోనా సమయంలో ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసాదం చేస్తున్న భగవద్గీత లోని శ్లోకాలు ప్రతిరోజు నేర్చుకునే వాడినని చెప్పారు.
శ్రీ వెంకటనారాయణ – లా విద్యార్థి
ఎస్వీ యూనివర్సిటీలో రెండవ సంవత్సరం లా చదువుతున్నట్లు వెంకటనారాయణ చెప్పారు. భగవద్గీత పారాయణం ద్వారా మానవీయ విలువలు పెంపొందుతాయని, ఆధ్యాత్మిక, భగవత్ భక్తి మార్గాలు తెలుస్తుందన్నారు. మనిషి తన నిత్య జీవితంలో చేసే అన్ని కర్మల గురించి భగవద్గీత వివరిస్తుందని చెప్పారు.
శ్రీమతి లక్ష్మీదేవి (72 సం..) – గృహిణి
తిరుపతిలోని శివ జ్యోతి నగర్ లో నివాసముంటున్న తాను భగవద్గీతలోని అన్ని శ్లోకాలను పారాయణం చేసి, చుట్టుపక్కల ఉన్న మహిళలకు, చిన్నపిల్లలకు నేర్పిస్తున్నట్లు తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో భగవద్గీత శ్లోకాలను నేర్చుకోవడానికి వస్తున్నారని, దీనివలన వారిలో క్రమశిక్షణ, బిపి, షుగర్ సాధారణ స్థాయిలో ఉంటూ ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్పారు. గీతా పారాయణం ప్రపంచానికి దశ – దిశ నిర్దేశిస్తుందని వివరించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.