SUNDARA RAJA AVATARA UTSAVAMS COMMENCES _ వైభవంగా శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు ప్రారంభం
TIRUPATI, 07 JULY 2023: The annual Sundara Raja Avatarotsavams commenced on a grand religious note in Tiruchanoor on Friday.
In the morning Abhishekam and in the evening Unjal Seva were performed to the utsava deities in Sri Krishna Mukha Mandapam.
In the night Pedda Sesha Vahana seva performed where in Utsava deities blessed devotees all along the four mada streets.
AEO Sri Ramesh and others were present.
వైభవంగా శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2023, జూలై 07: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా మధ్యాహ్నం శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు.
సాయంత్రం శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. కాగా శనివారం రాత్రి స్వామివారు హనుమంత వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు.
చారిత్రక ప్రాశస్త్యం :
శ్రీసుందరరాజస్వామివారి అవతార మహోత్సవాల పురాణ నేపథ్యాన్ని పరిశీలిస్తే చాలా సంవత్సరాల క్రితం ముష్కరులు మధురైలో ఉన్న అళగిరి పెరుమాళ్ కోయిల్‌ను కూల్చేందుకు ప్రయత్నించారట. ఆ సమయంలో అక్కడున్న అర్చకస్వాములు శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవమూర్తులను తిరుచానూరుకు తీసుకొచ్చారని ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే స్వామివారి విగ్రహాలు (ఉత్సవర్లు) పురాతనంగా కనిపిస్తున్నాయి. మహంతుల కాలంలో అనగా 1902వ సంవత్సరంలో మూలమూర్తులను తయారుచేసి ప్రతిష్ఠించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆ తరువాత సుందరరాజస్వామివారికి అనేక ఉత్సవాలు జరిగాయి. స్వామివారిని జ్యేష్ఠమాసంలో శతభిష నక్షత్రం నాడు తిరుచానూరుకు తీసుకొచ్చినందున ఆ రోజు నుండి ఉత్తరాభాద్ర నక్షత్రం నాటికి ముగిసేలా అవతార మహోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రమేష్, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.