TIRUPATI ART PLATFORMS SHINE _ బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు – మహతిలో అలరించిన సకల కళాసమాహారం
TIRUPATI, 22 OCTOBER 2023:The various art stages in Tirupati sizzled with glittering performances by artists on Sunday in connection with the ongoing Navaratri Brahmotsavams in Tirumala.
In Mahati a 52 member team from Annamacharya Project impressed the spectators with their amazing skills in Dance, Vocal, Drawing, instrument, Harikatja etc.at a time on a single platform.
In Ramachandra Pushkarini and Annamacharya Kalamandiram also the devotional musical night allured the Tirupatites.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు
– మహతిలో అలరించిన సకల కళాసమాహారం
తిరుమల, 2023 అక్టోబరు 22 ; శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆదివారం తిరుమల, తిరుపతిలోని పలు వేదికలపై టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
తిరుపతి మహతి కళాక్షేత్రంలో అన్మమాచార్య ప్రాజెక్టు కు చెందిన శ్రీ మురళీకృష్ణ బృందం 52 మంది కళాకారులతో వినూత్నంగా ‘సకల కళా సమాహారం -నారాయణతే నమో నమో’ గాత్రం, వాద్యం, దానికి తగినట్లు చిత్రలేఖనం, నాట్యం, హరికథ, కర్ణాటక, హిందుస్థాని సంగీతం, నామసంకీర్తన భజన, బుర్రకథల సంప్రదాయంలో సభను ఆశ్చర్యపరుస్తూ భక్తిరసవాహినిలో ముంచెత్తింది.
కార్యక్రమం ప్రారంభంలో నారాయణతే నమో నమో కీర్తనను సరస్వతిప్రసాద్, లావణ్య ఆలపించగా, ఐదు రాగాలలో శ్రీనివాసకుమార్ అదే కీర్తనను ఆలపించారు. ప్రముఖ చిత్రకారులు శ్రీ సింగంపల్లి సత్యనారాయణ అప్పటికప్పుడు కీర్తనకు తగిన చిత్రం వేయడం సభను అలరించింది. ఆపై శ్రీ గిరినాథరెడ్డి, రవిశంకర్ వయోలిన్ పై అదే కీర్తనను పాశ్చాత్య పద్ధతిలో వాయించి సభను అబ్బురపరచారు. తరువాత హిందుస్థాని గాత్రం, నామసంకీర్తనం, క్లారినేట్, మోర్సింగ్, వై.వేంకటేశ్వర్లు భాగవతార్ హరికథ, కూచిపుడి-భరతనాట్య జుగల్బంది, బుర్రకథతో కార్యక్రమం సమాప్తమైంది.
రామచంద్ర పుష్కరిణి వేదికపై అన్నమాచార్య ప్రాజెక్టుకు చెందిన పి.రాజేష్ కుమార్, కె.సుబ్రహ్మణ్యం గాత్రకచేరి సభాసదులను భక్తిరసవాహినిలో ముంచెత్తింది. వీరికి బి.గోపాల్ మృదంగం, ఆర్. శ్రీనివాసులు కీబోర్డు, జె.భానుప్రకాష్ శ్రుతిపై సహకారమందించారు.
స్థానిక అన్నమాచార్య కళామందిరంలో మహిళా విశ్వవిద్యాలయ సంగీత విభాగ ప్రొఫెసర్ ద్వారం లక్ష్మి గాత్రకచేరి మధురంగా జరిగింది. వీరికి మృదంగంపై నరసింహులు, వయోలిన్ పై కృష్ణవాసి, తబలాపై మంజనాథ్ సహకరించారు.
ఈ కార్యక్రమాల్లో ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య సూరం శ్రీనివాసులు, ఎస్వీ సంగీత నృత్య కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ శ్రీ సుధాకర్, అన్నమాచార్యప్రాజెక్టు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డా. లత తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలోని ఆస్థానమండపంలో ఉదయం వేద సందేశం, శ్రీమతి కృష్ణవేణి బృందం విష్ణుసహస్రనామపారాయణం, శ్రీమతి కాంచన బృందం భక్తి సంగీతం, శ్రీ కె.రాజశేఖర్ భక్తామృతం ధార్మికోపన్యాసం, సాయంత్రం శ్రీమతి అపర్ణ బృందం అన్నమయ్య విన్నపాలు, రాత్రి శ్రీ పద్మనాభశర్మ బృందం హరికథా పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.