సెప్టెంబ‌రు 30 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు శ్రీ ఆమ్నాయాక్షి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

 

సెప్టెంబ‌రు 30 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు శ్రీ ఆమ్నాయాక్షి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2019 సెప్టెంబ‌రు 29:   టిటిడి ఆధ్వర్యంలోని నారాయణవనం శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న సముదాయం గ్రామంలోని శ్రీ ఆమ్నాయాక్షి(అవనాక్షి) అమ్మవారి ఆలయంలో సెప్టెంబ‌రు 30 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు (జాతర) వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

సెప్టెంబ‌రు 30న సోమ‌వారం ఉద‌యం అమ్మవారికి అభిషేకం, స‌మ‌ర్ప‌ణ‌, ఉద‌యం 6 నుండి 7.30 గంట‌ల‌కు తులా ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం నిర్వ‌హిస్తారు. అక్టోబ‌రు 1న ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు అమ్మ‌వారి మూల‌వ‌ర్ల‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు అభిషేకం చేప‌డ‌తారు. అక్టోబ‌రు 1 నుండి 8వ తేదీ వ‌ర‌కు సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల్‌సేవ‌, ఆల‌య ప్రాకార ఉత్స‌వం నిర్వ‌హిస్తారు. అక్టోబ‌రు 8న రాత్రి 7 గంట‌ల‌కు ధ్వ‌జావ‌రోహ‌ణం జ‌రుగ‌నుంది.

ఆలయ ప్రాశస్త్యం

ఆమ్నాయాక్షి అనగా వేదాలే కళ్లుగా గల అమ్మవారు అని అర్థం. ఈ ఆలయంలోని అమ్మవారిని చతుర్ముఖ బ్రహ్మ ప్రతిష్ఠించినట్టు ఐతిహ్యం. నారాయణవనం ఆలయాన్ని 1967, ఏప్రిల్‌ 9న టిటిడి తన ఆధీనంలోకి తీసుకుంది. దీంతో పాటు పురాతన ఆమ్నాయాక్షి అమ్మవారి ఆలయం కూడా టిటిడి పరిధిలోకి వచ్చింది. నారాయణవనాన్ని పాలించిన శ్రీపద్మావతి అమ్మవారి తండ్రి అయిన ఆకాశరాజు వంశస్థులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.