RATHOTSAVAM HELD _ వేడుకగా రథోత్సవం
Tirupati, 25 February 2025: The annual Brahmotsavam at Srinivasa Mangapuram entered the eighth day on Tuesday.
On the penultimate day, Sri Kalyana Venkateswara along with Sridevi and Bhudevi atop the wooden chariot paraded along the streets surrounding the temple blessing His devout.
SE Sri Manoharam, EE Sri Jaganmohan Reddy, Spl Gr DyEO Smt Varalakshmi, VGO Smt Sadalakshmi and other staff were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు
- వేడుకగా రథోత్సవం
- భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు
– ఫిబ్రవరి 26న చక్రస్నానం
తిరుపతి, 2025 ఫిబ్రవరి 25: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయం 8.40 నుండి 9.40 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీవారి రథాన్ని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథస్తుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని అర్చకులు తెలిపారు.
రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఇ శ్రీ మనోహరం, ఇఇ శ్రీ జగనోహ్మన్ రెడ్డి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, విజివో శ్రీమతి సదాలక్ష్మీ, ఏఈవో శ్రీ గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్, ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్, శ్రీ ధన శేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 26న చక్రస్నానం :
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన బుధవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం 9 నుండి 10 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా చక్రస్నానం జరుగనుంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.