ఆగష్టు 21వ తేది వరకు అలిపిరి కాలినడక దారిలో నిర్ణిత స‌మ‌యంలోనే అనుమ‌తి – ఈవో                 

ఆగష్టు 21వ తేది వరకు అలిపిరి కాలినడక దారిలో నిర్ణిత స‌మ‌యంలోనే అనుమ‌తి – ఈవో                

 తిరుపతి, ఆగష్టు-12: ఆగష్టు 21వ తేది వరకు అలిపిరి కాలినడక దారిలో సాయంత్రం 4 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు భక్తులను అనుమతించరాదని నిర్ణయం తీసుకొన్నట్లు తితిదే కార్యనిర్వహణ అధికారి శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో అటవిశాఖ, పోలీస్‌, తితిదే అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజుల ముందు ఇద్దరి చిన్నపిల్లలపై దాడి చేసిన చిరుతను అటవీశాఖ సిబ్బంది పట్టుకోవడం జరిగిందని తెలిపారు. దీని వయస్సు 3-31/2 సంవత్సరాలు వుంటుందని, పట్టుబడింది మగ చిరుత అని తెలిపారు. అయితే మగ చిరుతను బంధించడం ద్వారా ఆడ చిరుత ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళవచ్చును లేక అదే దారిలో ఇబ్బందులను కలిగించే అవకాశముందని అటవీశాఖ అధికారులు స్పష్టంచేసినట్లు ఆయన తెలిపారు.
రాత్రి సమయాలలో నడక దారిలో భక్తుల అలికిడి లేనిచో ఆడ చిరుత కూడా బోనులోకి వచ్చే అవకాశం వుందని, కనుక రాత్రి పూట, కాలినడకదారి మూసివేయడమే భక్తులకు సురక్షితమని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా ఈవారంలో ఖచ్చితంగా ఆడ చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ

అధికారులు తమ ప్రయత్నాల్లో వున్నారని తెలిపారు.  కనుక భక్తులు ఈ మార్పును గమనించి ఆగష్టు 21వ తేది వరకు సాయంత్రం 4 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అలిపిరి కాలినడక దారిలో వెళ్ళవద్దని కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో కోరారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.