ఇఎస్ఐ ఆల‌స్యంతో జీతాల చెల్లింపులో జాప్యం

ఇఎస్ఐ ఆల‌స్యంతో జీతాల చెల్లింపులో జాప్యం

తిరుమ‌ల‌, 2020 జూన్ 11: టిటిడిలో భ‌ద్ర‌తా విధులు నిర్వ‌హిస్తున్న మాజీ సైనిక సిబ్బందికి స‌ద‌రు పొరుగుసేవ‌ల సంస్థ ఇఎస్ఐ(ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్) ఆల‌స్యంగా చెల్లించ‌డంతో జీతాల చెల్లింపులో జాప్యం జ‌రిగింద‌ని టిటిడి విఎస్‌వో శ్రీ ప్ర‌భాక‌ర్ గురువారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

ఢిల్లీలోని ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్‌మెంట్‌ సంస్థ నుండి 263 మంది మాజీ సైనికులు పొరుగుసేవ‌ల ప్రాతిప‌దిక‌న టిటిడిలో భ‌ద్ర‌తా విధులు నిర్వ‌హిస్తున్నారు. వీరికి మార్చి వ‌ర‌కు జీతాల చెల్లింపు జ‌రిగింది. సాధార‌ణంగా జీతం బిల్లు పాస్ కావాలంటే గ‌త నెల చెల్లించిన ఇఎస్ఐ ర‌సీదులు స‌మ‌ర్పించాలి. ఈ క్ర‌మంలో ఏప్రిల్ నెల‌కు సంబంధించి ఇఎస్ఐ ర‌సీదుల‌ను సద‌రు పొరుగుసేవ‌ల సంస్థ స‌మ‌ర్పించ‌క‌పోవ‌డంతో నిబంధ‌న‌ల ప్ర‌కారం జీతం బిల్లు పాస్ కాలేదు. ఈ విష‌య‌మై స‌ద‌రు పొరుగుసేవ‌ల సంస్థ‌ను సంప్ర‌దించ‌గా కోవిడ్‌-19 కార‌ణంగా ఢిల్లీలోని ఇఎస్ఐ కార్యాలయం ప‌నిచేయ‌డం లేద‌ని, నాలుగైదు రోజుల్లో నిబంధ‌న‌ల ప్ర‌కారం ర‌సీదులు స‌మ‌ర్పించి జీతాలు చెల్లిస్తామ‌ని ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్‌మెంట్ సంస్థ తెలిపింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.