ఘ‌నంగా శ్రీ ఆండాళ్ అమ్మవారికి శుక్రవార ఉత్సవం

ఘ‌నంగా శ్రీ ఆండాళ్ అమ్మవారికి శుక్రవార ఉత్సవం
 
ఫిబ్రవరి 28, తిరుప‌తి, 2020: శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ ఆండాళ్ అమ్మవారికి శ్రీపుండరీకవళ్ళి అమ్మవారికి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, ఊంజల్  సేవ, వీధి ఉత్సవం, ఆస్థానం వేడుకగా నిర్వహించారు.

ఇందులో భాగంగా శ్రీఆండాళ్ అమ్మవారికి మరియు శ్రీపుండరీకవళ్ళి అమ్మవారికి మూలవర్లకు మరియు ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. తరువాత సాయంత్రం శ్రీ ఆండాళ్ అమ్మవారిని బంగారు తిరుచ్చి మీద విశేషంగా అలంకరించి 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు లక్ష్మీ మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. ఊంజల్ సేవలో వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంగీత కార్యక్రమాల మద్య ఊంజల్ సేవ వేడుకగా సాగింది. అనంతరం 5.30 నుంచి 6.30 వరకు వీధి ఉత్సవం నిర్వహించారు. వీధి ఉత్సవంలో స్థానికులు, భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. వీధి ఉత్సవం అనంతరం శ్రీ ఆండాళ్ అమ్మవారితో పాటుగా శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారిని ఇంకొక తిరుచ్చి మీద కొలువుదీర్చి విమాన ప్రకారం ప్రదక్షిణ గావించారు. అనంతరం  శ్రీ ఆండాళ్,  శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారి ఆలయాల్లో శుక్రవార ఆస్థానం నిర్వహించారు.
 
ఈ కార్య‌క్ర‌మాల్లో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్‌ స్వామి, శ్రీశ్రీ‌శ్రీ‌ చిన్నజీయ‌ర్ స్వామి,  ఆలయ ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వరలక్ష్మి, ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ రాజ్‌కుమార్, శ్రీ శర్మ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ మునేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.