త్యాగరాజ కీర్తనల్లోని పరమార్థాన్ని గ్రహించాలి : ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి 

త్యాగరాజ కీర్తనల్లోని పరమార్థాన్ని గ్రహించాలి : ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి

తిరుపతి, ఫిబ్రవరి 01,2013: వాగ్గేయకార చక్రవర్తిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ త్యాగరాజస్వామి కీర్తనల్లోని పరమార్థాన్ని గ్రహించాలని తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి సంగీత విద్యార్థులకు సూచించారు. శ్రీ త్యాగరాజస్వామి వారి 166వ వర్ధంతి పుష్యబహుళ పంచమిని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత మరియు నృత్య కళాశాల ఆధ్వర్యంలో 27 గంటల పాటు నిర్వహించిన మూడో అఖండ ఆరాధనోత్సవం శుక్రవారం ఉదయం ఘనంగా ముగిసింది.
 
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తూ త్యాగరాజస్వామి మొత్తం 24 వేల కీర్తనలు రచించారని, వాటిలో 757 కీర్తనలు మాత్రమే లభ్యమయ్యాయని తెలిపారు. అతికొద్దిగా లభ్యమైన ఈ కీర్తనలను సంగీత అధ్యాపకులు, విద్యార్థులు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. త్యాగరాజస్వామి తన కీర్తనల్లో ఎంతో మంది దేవుళ్లను కీర్తించారని, ఆరాధనోత్సవాల ద్వారా ఆయన్ను కీర్తించుకోవడం ముదావహమని అన్నారు.
 
సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి చల్లా ప్రభావతి దీక్షితులు మాట్లాడుతూ ప్రస్తుత సంగీత కళాకారులు త్యాగరాజస్వామి రచించిన కొన్ని కీర్తనలు మాత్రమే ఆలపిస్తూ వాటికే పరిమితమవుతున్నారని, అలాకాకుండా లభ్యమైన అన్ని కీర్తనలు ఆలపించేలా వారిని చైతన్యపరచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ క్రమంలోనే సంగీత కళాశాల, నాదస్వర పాఠశాలలోని తొమ్మిది విభాగాలకు చెందిన 45 మంది అధ్యాపకులు, 63 మంది విద్యార్థినీ విద్యార్థులు కలిసి ఒకరు పాడిన త్యాగరాజ కృతిని మరొకరు పాడకుండా 135 రాగాలతో, 261 కృతులను ఆలపించినట్టు వివరించారు.
 
కాగా గురువారం ఉదయం 8.00 గంటలకు ప్రారంభమైన అఖండ గానయజ్ఞం శుక్రవారం ఉదయం 11.00 గంటలకు ముగిసింది. ముగింపు కార్యక్రమంలో సంగీత అధ్యాపకులు, విద్యార్థులు కలిసి శ్రీ త్యాగరాజస్వామి దివ్యనామ సంకీర్తనలు, ఉత్సవ సంప్రదాయ కీర్తనలను బృందగానం చేశారు.
 
ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ కోమండూరి శేషాద్రి, తితిదే పూర్వ విద్యాశాఖాధికారి డాక్టర్‌ కె.నాగరాజు, ప్రముఖ చిత్రకారుడు శ్రీ సింగంపల్లి సత్యనారాయణ, ఎస్వీ నాదస్వర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ అన్నవరపు సత్యనారాయణ, సంగీత కళాశాల అధ్యాపకులు శ్రీ సుధాకర్‌, శ్రీమతి చిన్నమ్మదేవి, ఇతర అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.