వైభవంగా శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం

వైభవంగా శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2012 జూలై 14: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి మూలవర్ల తిరుమంజనం నిర్వహించారు.

         అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11.00 గంటలకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం, భాష్యకార్ల గుడి వద్ద యిహల్‌ శాత్తుమొర నిర్వహించనున్నారు. రాత్రి 7.00 గంటల నుండి 9.00 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో తితిదే సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖర్‌ పిళ్లై, సూపరింటెండెంట్‌ శ్రీ మునిసురేష్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ఆంజనేయులు, శ్రీ సుందరం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.