SAINT DEVOTEES FESTIVITIES LINES UP IN VAISAKHA MONTH _ మాసంలో భక్తాగ్రేసరుల జయంతులు

TIRUMALA, 19 APRIL 2023: The Tirunakchatrotsavams of many sages and saint devotees are lined up in the sacred month of Vaisakha in Tirumala.

 

Sri Parasurama Jayanti on April 22, Sri Brigu Maharshi and Sri Sreenivasa Deekshitulu Varsha Tirunakshatram on April 23, Sri Ramanujacharya Jayanti on April 25, Saint Musician Sri Tyagaraja Swamy Jayanti on April 26, Sri Madhurakavi Alwar, Sri Anantalwar, Matrusri Tarigonda Vengamamba Jayantis on May 4, Sri Kurma Jayanti on May 5, Sri Tallapaka Annamacharya Jayanti on May 6, Sri Parasara Bhattar Varsha Tirunakshatram on May 7, Sri Hanuman Jayanti on May 14.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైశాఖ మాసంలో భక్తాగ్రేసరుల జయంతులు
 
తిరుమల, 2023 ఏప్రిల్ 19: వైశాఖ మాసం పరమ పవిత్రమైనది. ఈ మాసంలో భగవంతుడైన శ్రీ నరసింహస్వామి వారితోపాటు భక్తాగ్రగణ్యులైన శ్రీ హనుమంతుడు, శ్రీ భగవద్‌ రామానుజులు, శ్రీ త్యాగరాజస్వామి, శ్రీ తాళ్లపాక అన్నమయ్య, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జన్మించారు. ధర్మప్రచారంలో భాగంగా ఈ మహనీయుల జయంతులను టిటిడి క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది.
 
శ్రీరామానుజాచార్యులు : 
 
ఏప్రిల్‌ 25న శ్రీరామానుజాచార్యుల జయంతి జరుగనుంది. భగవద్‌ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ”శ్రీభాష్యం” పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా ప్రసిద్ధిచెందారు. ఈయన 1017 పింగళనామ సంవత్సరం వైశాఖమాసంలో ఆర్ద్రా నక్షత్రం రోజున ఆదిశేషుని అంశావతారంగా శ్రీపెరంబుదూరులో జన్మించారు. 1137వ సంవత్సరంలో పరమపదించారు. 120 ఏళ్ల జీవితంలో దేశమంతటా సంచరించి శ్రీవైష్ణవతత్వాన్ని పరిపుష్టం చేస్తూ ప్రచారం చేశారు. అగ్రవర్ణాలవారికి మాత్రమే గాక అట్టడుగున ఉన్న వర్గాలవారికి కూడా వైష్ణవమతాన్ని స్వీకరించేందుకు అవకాశం కల్పించారు. దేశంలోని అనేక శ్రీవైష్ణవక్షేత్రాల జీర్ణోద్ధరణ, అభివృద్ధి చేయడంతోపాటు ఆలయ పూజాది కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం ఆర్ద్రా నక్షత్రం రోజున శ్రీరామానుజ జయంతిని టిటిడి ఘనంగా నిర్వహిస్తోంది. 
 
శ్రీ ఆదిశంకరాచార్యులవారి జయంతి ఏప్రిల్‌ 25వ తేదీన జరుగనుంది. అద్వైత సిద్ధాంతంతో భారతదేశంలో సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేసిన మొదటి గురువులు వీరు.
 
శ్రీ త్యాగరాజస్వామి : 
 
శ్రీ త్యాగరాజస్వామివారి జయంతిని ఏప్రిల్‌ 26వ తేదీన నిర్వహిస్తారు. వీరు 1767వ సంవత్సరంలో జన్మించారు. వీరి వంశీయులు ప్రకాశం జిల్లా కాకర్ల గ్రామానికి చెందినవారు. యుక్త వయసులో త్యాగయ్య భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకు సంతోషించిన నారద మహర్షి స్వయంగా స్వరార్ణవం అనే సంగీత గ్రంథాన్ని ఇచ్చి ఆశీర్వదించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. సంగీత జగద్గురువుగా వినుతికెక్కిన త్యాగయ్య దాదాపు 180 సంవత్సరాల క్రితం తిరువయ్యార్‌ నుంచి తిరుమల క్షేత్రానికి విచ్చేసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈయన 1847వ సంవత్సరంలో పరమపదించారు. ఇంతటి గొప్పచరిత్ర గల త్యాగయ్య వర్ధంతి ఆరాధనోత్సవాలను తిరువయ్యారులో ప్రతి ఏటా పుష్యబహుళ పంచమినాడు వైభవంగా నిర్వహిస్తారు. 
 
త్యాగయ్య జయంతి ఉత్సవాలను ఏప్రిల్‌ 26వ తేదీన తిరుమల నాదనీరాజన వేదికతోపాటు తిరుపతిలోని ఎస్వీ సంగీత కళాశాలలో టిటిడి ఘనంగా నిర్వహించనుంది.
 
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ : 
 
శ్రీవారిపై అచంచలమైన భక్తివిశ్వాసాలు ప్రదర్శించిన శ్రీ తరిగొండ వెంగమాంబ 1730వ సంవత్సరంలో జన్మించారు. శ్రీ రాఘవేంద్రస్వామి, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి లాగా తన బృందావనంలోనే 1817లో సజీవ సమాధి చెందారు. తిరుమలలో అన్నదానాన్ని ప్రారంభించినందుకు గుర్తుగా వెంగమాంబ పేరు ముందు మాతృశ్రీ అనే పదం చేరింది. టిటిడి ప్రతి ఏడాదీ వెంగమాంబ జయంతిని క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. వెంగమాంబ జయంతిని మే 4వ తేదీన తిరుమలలో ఘనంగా నిర్వహిస్తారు. అదేరోజున తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీనరసింహ జయంతి ఉత్సవం ఘనంగా జరుగనుంది.
 
శ్రీ తాళ్లపాక అన్నమయ్య : 
 
కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారిని కీర్తిస్తూ 32 వేల కీర్తనలు రచించిన వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు. వీరు 1408లో జన్మించారు. 1503లో పరమపదించారు. వీరు తొలి తెలుగు వాగ్గేయకారుడిగా, పదకవితా పితామహుడుగా  ప్రఖ్యాతి పొందారు. అన్నమయ్య జయంతి సందర్భంగా మే 6న తిరుమల, తిరుపతి, తాళ్లపాకలో సంగీత, సాంస్కృతిక, సాహితీ కార్యక్రమాలు నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేపట్టింది.
 
అదేవిధంగా వైశాఖమాసంలో ఏప్రిల్ 22న పరశురామ జయంతి, ఏప్రిల్ 23న భృగు మహర్షి వర్షతిరునక్షత్రం, శ్రీ శ్రీనివాసదీక్షితుల వర్షతిరునక్షత్రం, మే 4న మధురకవియాళ్వార్ జయంతి, అనంతాళ్వార్ జయంతి, మే 5న కూర్మ జయంతి, మే 7న పరాశరభట్టర్ వర్షతిరునక్షత్రం, మే 14న హనుమజ్జయంతి జరగనున్నాయి.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.