శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జెఈవో సమీక్ష 

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జెఈవో సమీక్ష

తిరుపతి, ఫిబ్రవరి 25, 2013  : వచ్చే నెల మార్చి ఒకటి నుండి తొమ్మిదో తేదీ వరకు జరుగనున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి సోమవారం శ్రీనివాసమంగాపురంలోని తితిదే కల్యాణమండపంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటల నుండి తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం నుండి శ్రీనివాసమంగాపురం వరకు శోభాయాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ శోభాయాత్రలో గరుడసేవ రోజు తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారికి అలంకరించే లక్ష్మీహారాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు వివరించారు. మార్చి ఒకటో తేదీ నుండి ప్రతిరోజూ 2000 లడ్డూలు, 500 వడ ప్రసాదం భక్తులకు విక్రయించేందుకు అందుబాటులో ఉంచనున్నట్టు చెప్పారు. శ్రీనివాసమంగాపురానికి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థినీ విద్యార్థులకు స్వామివారి దర్శనం, ప్రసాదాలు అందిస్తామన్నారు.
 
చంద్రగిరి, రేణిగుంట, రామచంద్రాపురం, వడమాలపేట, ఏర్పేడు మండలాల పరిధిలోని దాదాపు 200 గ్రామాల్లో ప్రచారరథాలు, భజనబృందాలతో పర్యటించి స్వామివారి వైభవాన్ని తెలిపే 2 లక్షల కరపత్రాలను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ ప్రవీణ్‌ శ్రీవాస్తవను బ్రహ్మోత్సవాలకు ఆహ్వాని స్తున్నట్టు జెఈవో తెలిపారు. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణలు, ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ముందస్తుగా క్యూలైన్లు, చలువపందిళ్లు, అన్ని కూడళ్లలో ఫ్లెక్సీ బోర్డులు, విద్యుత్‌ విభాగం ఆధ్వర్యంలో దేదీప్యమానంగా విద్యుద్దీపాలంకరణలు ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.

శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలపై జెఈవో సమీక్ష
 
అనంతరం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మట్లాడుతూ మార్చి 10వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ”శివకేశవం” అనే ప్రత్యేక కార్యక్రమంలో ”పేరిణి శివతాండవం” నృత్యప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అదేరోజు సాయంత్రం మహతి కళాక్షేత్రంలో కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ స్వామివారిచే శైవక్షేత్రాల వైశిష్ట్యంపై ప్రవచనాలు, 16 మంది ప్రముఖ సాహితీవేత్తలతో ”శివకవులు” నాటకం ప్రదర్శించనున్నట్టు వెల్లడించారు. ఆలయంలో పుష్పాలంకరణ, చలువ పందిళ్లు, విద్యుద్దీపాలంకరణ, ప్రముఖ కూడళ్లలో ఫ్లెక్సీబోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
 
ఈ సమావేశంలో తితిదే స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డెమ్మ, హిందూ ధర్మప్రచార పరిషత్‌ ప్రత్యేకాధికారి శ్రీ ఎస్‌.రఘునాధ్‌, తిరుమల ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ చిన్నంగారి రమణ, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్‌ మేడసాని మోహన్‌, ఎస్‌ఇ వెంకటేశ్వర్లు, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.