శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా జ్యేష్టాభిషేకం

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా జ్యేష్టాభిషేకం

తిరుపతి, 2012 జూలై 01: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రెండో రోజైన ఆదివారం జ్యేష్టాభి షేకం ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు విశ్వరూప దర్శనం కల్పించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు కళ్యాణమండపంలోకి వేంచేపు చేశారు. అక్కడ శతకలశ స్నపనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పంచామృతం, చెరకు, వివిధ రకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. అనంతరం మహాశాంతిహోమం, తిరుమంజనం, సమర్పణ, ఆరగింపు, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మోఘోష వినిపించారు. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు. సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు ఉభయనాంచారులతో కలసి శ్రీవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు.

ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ చిన్నస్వామి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, కంకణబట్టర్‌ శ్రీ ఎ.టి.చక్రవర్తి శేషాద్రి దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ సుధాకర్‌ బాబు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ పి.ఎస్‌.బాలాజీ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.