MAHA VISHNU ON SURYAPRABHA _ సూర్యప్రభ వాహనంపై శ్రీ మహావిష్ణు అలంకారంలో శ్రీ క‌ల్యాణ శ్రీనివాసుడు 

TIRUPATI, 17 FEBRUARY 2023:  On the seventh day morning, Sri Kalyana Venkateswara as Maha Vishnu took a celestial ride on Suryaprabha Vahanam.

 

Friday morning witnessed the beauty and shine of the Lord on the Sund God carrier as a part of the ongoing annual fete at Srinivasa Mangapuram.

 

JEO Sri Veerabrahmam, Special DyEO Smt Varalakshmi, AEO Sri Gurumurty and others were present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సూర్యప్రభ వాహనంపై శ్రీ మహావిష్ణు అలంకారంలో శ్రీ క‌ల్యాణ శ్రీనివాసుడు

తిరుపతి, 2023 ఫిబ్రవరి 17: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై శ్రీ మహావిష్ణు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సూర్యప్రభ వాహనం – ఆయురారోగ్య‌ప్రాప్తి

బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

కాగా సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌ సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుండి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

వాహనసేవలో జెఈఓ శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, కంకణ బట్టార్ శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 18న రథోత్సవం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శనివారం రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 5 .30 గంటలకు స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 7.10 నుండి 8.30 గంటల వరకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.