PUSHPAYAGAM HELD _ శ్రీవారి ఆలయంలో శోభాయమానంగా పుష్పయాగం
TIRUMALA, 19 NOVEMBER 2023: The annual Pushpayagam was held with religious fervour on Sunday evening in Tirumala temple.
In the evening the Utsava Murties were seated on the special platform and a floral bath was rendered with eight tonnes of 17 varieties of flowers amidst chanting of Vedic mantras.
Later the Garden Dy Director Sri Srinivasulu was felicitated on the occasion.
TTD Chairman Sri B Karunakara Reddy, TTD EO Sri AV Dharma Reddy, JEO for Health and Education Smt Sada Bhargavi, DyEO Sri Lokanatham, VGO Sri Nanda Kishore, Peishkar Sri Srihari, Parupattedar Sri Uma Maheswara Reddy were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీవారి ఆలయంలో శోభాయమానంగా పుష్పయాగం
తిరుమల, 2023 నవంబరు 19: పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం పుష్పయాగ మహోత్సవం శోభాయమానంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 17 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఏవీ.ధర్మారెడ్డి పాల్గొన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అర్చకుల వల్లగానీ, ఉద్యోగుల వల్లగానీ, భక్తుల వల్లగానీ జరిగిన దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహిస్తారు.
శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నులపండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టువస్త్రాభరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం చేశారు. చామంతి, వృక్షి, సంపంగి, సెంటు జాజులు, పొగడ, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి, నిత్యమల్లి, మనోరంజితం, పారిజాతం పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు.
పుష్పాధిదేవుడు ”పుల్లుడు” ఆవాహన
పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు. అనంతరం స్వామివారు తన దేవేరులతో కలిసి సహస్రదీపాలంకార సేవలో పాల్గొన్నారు. ఆ తరువాత ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
పుష్పయాగానికి మొత్తం 8 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు విరాళంగా అందించారు. తమిళనాడు నుండి 4 టన్నులు, కర్ణాటక నుండి 2 టన్నులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి 2 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందజేశారు.
ఉద్యానవన డెప్యూటీ డైరెక్టర్‌కు సన్మానం
శ్రీవారి పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించేందుకు దాతల నుంచి పుష్పాలు సేకరించేందుకు కృషి చేసిన టీటీడీ ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులును పారుపత్తేదార్ శ్రీ ఉమామహేశ్వర్ రెడ్డి శాలువతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జెఈవో శ్రీమతి సదా భార్గవి, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం, విజివో శ్రీ నంద కిషోర్, పేష్కార్ శ్రీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.