బ్రహ్మోత్సవాల్లో అలరించిన సీతాకల్యాణం నృత్యరూపకం
అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలతో భక్తిభావాన్ని పంచిన గాత్ర సంగీతం
తిరుపతి, 2026 సెప్టెంబరు 20 ; తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆరవ రోజు ఆదివారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నిర్వహించిన “సీతాకల్యాణం” నృత్యరూపకం ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది.
భక్తిభావాన్ని పంచిన గాత్ర కచేరి
శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల గాత్ర అధ్యాపకురాలు శ్రీమతి చిన్నమదేవి బృందం నిర్వహించిన గాత్ర కచేరి హృద్యంగా సాగింది. అన్నమయ్య కీర్తన *“వాడే వేంకటాద్రి”*తో కచేరిని ప్రారంభించిన చిన్నమదేవి, అనంతరం “శ్రీనివాస తే చరణం”, త్యాగరాజ స్వామివారి “సరస సామ దాన భేద” తదితర కీర్తనలను ఆలపించారు. మృదుమధుర గాత్రంతో ఆమె ఆలపించిన భక్తిగీతాలు శ్రోతలను భక్తిభావంలో ఓలలాడించాయి.
సీతాకల్యాణంతో ఆకట్టుకున్న కళాకారులు
అనంతరం శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల భరతనాట్య అధ్యాపకులు శ్రీ సి. హరనాథ్ తన శిష్య బృందంతో ప్రదర్శించిన “సీతాకల్యాణం” నృత్యరూపకం విశేషంగా ఆకట్టుకుంది.
శ్రీరాముడు–సీతాదేవి కల్యాణ ఘట్టాలను భరతనాట్య అభినయం, నృత్య విన్యాసాలతో కళాకారులు అద్భుతంగా ఆవిష్కరించారు. కళాకారుల హావభావాలు, నృత్యాభినయం, చక్కటి సమన్వయంతో మహతి కళాక్షేత్రం ఆధ్యాత్మిక కళావేదికగా మారింది.
అన్నమాచార్య కళామందిరంలో అలరించిన కళాకారులు
అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు హైదరాబాదుకు చెందిన కుమారి శ్రీనిధి బృందం గాత్ర సంగీత కార్యక్రమం నిర్వహించి ఆహూతులను అలరించింది. అనంతరం సింగపూర్‌కు చెందిన శ్రీ రత్నకుమార్ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనతో ఆకట్టుకుంది.
శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద భక్తి సంగీతం
శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద తిరుపతికి చెందిన శ్రీమతి సుగుణమ్మ బృందం భక్తి సంగీత కార్యక్రమాన్ని నిర్వహించింది. హైదరాబాదుకు చెందిన శ్రీమతి గాయత్రి, శ్రీమతి మయూరి బృందాలు సంకీర్తన ఆలాపనతో భక్తులను అలరించాయి.
ఈ సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద సంఖ్యలో తిరుపతి నగర ప్రజలు తిలకించి ఆనందించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడింది.