MALAYAPPA SWAMY GLIDES ON MAMMOTH GAJA VAHANAM _ గజ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారి దివ్య విహారం
Tirumala, 20 September 2026: Sri Malayappa Swamy, in His “Nija Roopa”(original form as Malayappa), appeared on the majestic Gaja Vahanam on the sixth evening of the annual Brahmotsavams on Sunday.
The divine elephant carried the deity with grandeur along the four Mada Streets, captivating devotees with its royal splendour.
Both the Pontiffs of Tirumala, TTD EO Sri Muddada Ravi Chandra, board members, Additional EO Sri Ch. Venkaiah Chowdhary, and other officials were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
గజ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారి దివ్య విహారం
భక్తులకు కరుణామృత కటాక్షం..
ప్రబంధ పారాయణం.. మంగళవాయిద్యాలు.. గోవిందనామస్మరణతో మార్మోగిన తిరుమాడ వీధులు
తిరుమల, 2026 సెప్టెంబరు 20: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు గజ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.
వాహనం ముందు గజరాజులు గంభీరంగా నడుస్తుండగా.. మంగళవాయిద్యాల నడుమ, భక్తజనుల గోవిందనామస్మరణతో తిరుమాడ వీధులు భక్తిపారవశ్యంతో మార్మోగాయి. భక్తబృందాలు భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఆధ్యాత్మిక సందడి నెలకొల్పాయి. జీయ్యంగార్ల ప్రబంధ పారాయణంతో వాహనసేవ మరింత వైభవంగా సాగింది.
విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ శ్రీ మలయప్ప స్వామివారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
గజ వాహనం – కర్మ విముక్తికి ప్రతీక
పూర్వకాలంలో రాజులను పట్టాభిషేకం వంటి విశేష సందర్భాల్లో గజాలపై ఊరేగించేవారు. విశిష్ట వ్యక్తులను ఘనంగా సత్కరించే సందర్భాల్లో గజారోహణం చేసే సంప్రదాయం కూడా ఉంది.
పురాణాల ప్రకారం శ్రీ మలయప్ప స్వామివారి గజ వాహన సేవను దర్శించడం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు. అందుకే గజ వాహనసేవకు భక్తులలో విశేష ప్రాధాన్యత ఉంది.
శ్రీ మలయప్ప స్వామివారు గజ వాహనాన్ని అధిరోహించిన రోజునే కాకుండా బ్రహ్మోత్సవాల ఇతర వాహనసేవల సమయంలోనూ టీటీడీ గజరాజులు ప్రత్యేకంగా పాల్గొని ఉత్సవ వైభవాన్ని ఇనుమడింపజేస్తాయి.
ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో శ్రీ సిహెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీ శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.









