శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, 2018 సెప్టెంబరు 19: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 20 నుంచి 22వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
ఇందులో భాగంగా సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు సేనాధిపతి తిరువీధి ఉత్సవము, సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు యాగశాల నందు మృత్సంగ్రహణం, పుణ్యహవచనం, విశేషపూజ, అంకురార్పణ ఘట్టాలు నిర్వహించనున్నారు.
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు.
సెప్టెంబరు 20వ తేదీ గురువారం పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 21న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 22న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.500/- చెల్లించి గృహస్తులు (ఇద్దరు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు.
ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్య్రకమంలో స్థానిక ఆలయాల డెప్యూటి ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ ఉదయ్ భాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ జ్ఞానప్రకాష్, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఎ.పి. శ్రీనివాస దీక్షితులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.