ANKURARPANAM OBSERVED _ శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Tiruchanoor, 22 November 2019: The festival of prelude, Beejavapanam or otherwise known as Ankurarpanam was performed with utmost religious fervour in Sri Padmavathi Ammavari temple at Tiruchanoor on Friday evening. 

TTD EO Sri Anil Kumar Singhal took part in this ritual.  Later speaking to media he said, all arrangements have been made for the nine day fete.  He said Ankurarpanam is the seed sowing festival seeking the healthy, prosperous and hassle free conduct of the mea fete. 

Meanwhile Mritsangrahanam, procession of Sri Vishwaksena were performed by the priests. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూత్సవాల ప్రత్యేకం
 
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
 
 తిరుపతి, 2019 నవంబరు 22: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ కార్తీక బ్రహ్మోత్సవాలకు  శుక్రవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.
 
సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.
 
అంకురార్పణ ఘట్టంలో ముందుగా భగవంతుని అనుజ్ఞ తీసుకుని షోడషోపచారాలు సమర్పించారు. సమస్తమైన విఘ్నాలు తొలగేందుకు విష్వక్సేనారాధన నిర్వహించారు. ఆ తరువాత స్థల శుద్ధి, ద్రవ్యశుద్ధి, శరీర శుద్ధి, ఆత్మశుద్ధి కోసం పుణ్యహవచనం చేపట్టారు. పుణ్యమైన మంత్రాలను పఠించి కలశంలోని నీటిని శుద్ధి చేయడాన్ని పుణ్యహవచనం అంటారు. సభాపూజలో భాగంగా భగవంతునికి సాష్టాంగ ప్రమాణం సమర్పించి అనుజ్ఞ తీసుకున్నారు. యాగశాలలో ఎవరెవరు ఎలాంటి విధులు నిర్వహించాలనే విషయాన్ని రుత్విక్‌వరణంలో వివరించారు.
 
అంకురార్పణ కార్యక్రమంలో ప్రధాన ఘట్టం మృత్సంగ్రహణం. అమ్మవారి ఆలయం వద్దగల శుక్రవారపు తోటలో ఈశాన్య దిశలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా శ్రీభూవరాహస్వామివారిని ప్రార్థించి, గాయత్రి అనుష్టానం, భూసూక్తం పారాయణం చేస్తారు. ధూపదీప నైవేద్యం సమర్పించి మాషాచోప(మినుముల అన్నం) బలిహరణ చేశారు. ఆ ప్రాంతాన్ని గోమూత్రం, గోమేయంతో శుద్ధి చేసి భూమాతను ఆవాహన చేసి వస్త్రసమర్పణగావించారు. భూమాత ఉధ్వాసన అనంతరం పుట్టమన్ను తీసుకుని ఆలయానికి వేంచేపు చేశారు. యాగశాలలో వాస్తుదోష నివారణ కోసం హవనం నిర్వహించారు. ఆ తరువాత పాలికల్లో మట్టిని, నవధాన్యాలను ఉంచి పసుపునీళ్లు చల్లి బీజవాపనం చేపట్టారు. అనంతరం నివేదన, బలిహరణ, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు.
 
అంకురార్పణ ఘట్టానికి వైఖానసం, పాంచరాత్ర ఆగమాల్లో విశేష ప్రాధాన్యం ఉందని, ఇవి భగవంతునికి రెండు కళ్లు లాంటివని టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీమత్‌ తిరుమల కాండూరి శ్రీనివాసాచార్యులు తెలిపారు. వైఖానసంలో మంత్రభాగాన్ని ప్రధానంగా తీసుకుని విష్ణువును అర్చిస్తారని, పాంచరాత్రంలో మంత్రం, తంత్రం, క్రియ, ముద్రలు ప్రధానంగా ఉంటాయని తెలియజేశారు.
 
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, విఎస్వో శ్రీ ప్రభాకర్, ఆలయ డెప్యూటి ఈఓ శ్రీమతి ఝాన్సీరాణి, ఎఇఓ శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ గోపాలకృష్ణారెడ్డి, ఎవిఎస్వో శ్రీ నందీశ్వర్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.