BHUTHA VAHANAM _ భూత వాహనంపై శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తి

On the 3rd day of Ongoing Brahmotsavam in TTDs Sri Kapileswara Swamy Temple, the processional deity of Lord Kapileswara Swamy along with Goddess Parvathi were taken out in procession on Bhutha Vahanam in Sri Kapileswara Swamy Temple in Tirupati on Tuesday morning. 

భూత వాహనంపై శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తి

తిరుపతి, మార్చి 5, 2013: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగళవారం ఉదయం కపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా భూత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవల ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయక నగర్‌ ఎల్‌ టైప్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కేరళ కళాకారుల వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.
పూర్వం క్రూరభూతాలు ప్రజలను బాధిస్తున్న వేళ పరమశివుని బ్రహ్మదేవుడు ఆ భూతాలను నిగ్రహించి లోకాలను కాపాడమని వేడుకొన్నాడు. ఈ కార్యానికి నిర్జన దేశమైన శ్మశానాలను తన ఆస్థానాలుగా చేసుకున్నాడు శివుడు. భూతాలను వశీకరించి శ్మశానాలలో ఉంచి బ్రహ్మసృష్టిని రక్షిస్తున్నాడని, నాటి నుండి ”భూతపతి”గా కీర్తించే జీవులకు భయాదులను తొలగించి శివుడు రక్షిస్తున్నాడని మహాభారతం వివరిస్తున్నది. అందుకు ప్రతీకగా లయకారుడు భూతవాహనంపై ఊరేగి భక్తులకు అభయమిచ్చాడు.
అనంతరం ఉదయం 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీ స్కోమస్కందమూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.
సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు సింహ వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు. మృగరాజు సింహం. దేవతల్లో అత్యంత ఉత్కృష్టుడు పరమేశ్వరుడు.  భక్తుల హృదయం గుహ వంటిది. ఆ గుహలో సింహం వంటి ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంచుకుంటే జీవుడు ఏ భయాన్ని పొందడు. మృగరాజు వంటి శివపరమాత్మ కొలువై అభయమిచ్చి జీవనాన్ని పాలిస్తుంటే, అరిషడ్వర్గాలనే కక్షుద్ర మృగాల భయం ఉండదు.
ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డెమ్మ, కపిలేశ్వరాలయ సూపరింటెండెంట్‌ సురేష్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాసులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.