PALLAKI UTSAVAM _ మోహినీ అవతారంలో సర్వలోక రక్షకుడు

Srinivasa Mangapuram, March 5, 2013: Processional Deity of Lord Sri Kalyana Venkateswara Swamy in form of Mohini Avatharam was taken out in procession atop Pallaki as part of 5th day ongoing Annual Brahmotsavam in Sri Kalyana Venkateswara Swamy Temple in Srinivasa Mangapuram near Tirupati on Tuesday morning. Earlier Garlands of Andal Ammavaru was taken out in procession from Sri Govindaraja Swamy Temple to Srinivasa Mangapuram. This garlands will be used on Garuda Vahanam in the evening.
 
TTD JEO Sri P.Venkatarami Reddy, CV&SO Sri GVG Ashok Kumar, Supdt Engineer Sri Sudhakar Rao, Spl Officer DPP Sri Raghunath, DyEO Smt Reddamma, AEO Sri Lakshman Naik, Temple staff and large number of devotees took part.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మోహినీ అవతారంలో సర్వలోక రక్షకుడు

తిరుపతి, మార్చి 5, 2013: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన మంగళవారం ఉదయం గోవిందుడు మోహినీ అవతారంలో పల్లకీలో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పల్లకీ ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు ఉదయం సకల లోక కల్యాణకారకుడు అయిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు దివ్యమోహినీ రూపంలో ఉత్సవమూర్తియై భక్తులను తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహకభేదాన్ని గుర్తుంచుకోలేకపోయింది. కనుక శ్రీవారు జగన్మోహినియై పల్లకీలో కూర్చొని ఉంటారు. ఈనాటి శ్రీవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తుంది.

అనంతరం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి బయలుదేరిన ఆండాళ్‌ అమ్మవారి మాల ఉదయం 11.30 గంటలకు ఆలయానికి చేరుకుంది. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్‌ స్వామి ఆలయ సంప్రదాయం ప్రకారం ఆండాళ్‌ మాలను తీసుకొచ్చారు. అక్కడినుండి ఊరేగింపుగా మాలలను శ్రీనివాసమంగాపురానికి తీసుకొచ్చారు. శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో తితిదే తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, సివి అండ్‌ ఎస్‌ఓ శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ ఆండాళ్‌ అమ్మవారి మాలల ఊరేగింపునకు స్వాగతం పలికారు. ఈ మాలను గరుడసేవ సందర్భంగా రాత్రికి స్వామివారికి అలంకరించనున్నారు.

కాగా ఉదయం తితిదే ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్‌ను జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు. ఇందులో మీడియా ప్రతినిధుల కోసం కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ వసతి కల్పించారు. ఇక్కడినుండి మీడియా ప్రతినిధులు తమ తమ కార్యాలయాలకు బ్రహ్మోత్సవాల విశేషాల వార్తలు, ఫొటోలు పంపుకునేందుకు ఏర్పాట్లు చేశారు.

అదేవిధంగా సేవల విభాగం డెప్యూటీ ఈవో శ్రీ శివారెడ్డి, తమ విభాగం సిబ్బందితో కలసి స్వామివారి పట్టువస్త్రాలు సమర్పించారు.

కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం కరతలామలకమని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఉదయం శ్రీమతి జె.సామ్రాజ్యలక్ష్మి శ్రీ విష్ణు లక్ష్మీ సహస్రనామ పారాయణం, శ్రీ సాయిబాబ పురాణ ప్రవచనం, ఆర్‌.మాధవీలత సంప్రదాయ భక్తి సంగీతం కార్యక్రమాలు జరిగాయి. మధ్యాహ్నం తిరుపతికి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి ధార్మికోపన్యాసం, తెనాలికి చెందిన శ్రీ చందు భాస్కర్‌రావు హరికథ వినిపించారు. సాయంత్రం శ్రీ ప్రమోద చైతన్యస్వామి ఆధ్యాత్మికోపన్యాసం, అన్నమాచార్య ప్రాజెక్టు గాయకులు శ్రీ ఎస్‌.వి.ఆనంద భట్టర్‌ అన్నమయ్య విన్నపాలు సంగీత కచేరి నిర్వహించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.