EO REVIEWS TTD DISASTER MANAGEMENT _ టీటీడీలో విపత్తుల నిర్వహణపై ఈవో సమీక్ష
టీటీడీలో విపత్తుల నిర్వహణపై ఈవో సమీక్ష
– నిపుణులు రూపొందించిన డాక్యుమెంటు పరిశీలన
తిరుమల, 2023, అక్టోబరు 06: టీటీడీలో విపత్తుల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపి విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. సి.నాగరాజు, యూనిసెఫ్ కన్సల్టెంట్ శ్రీ అమల్ కృష్ణ రూపొందించిన డాక్యుమెంటును పరిశీలించారు. అనంతరం వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డాక్యుమెంట్ లోని అంశాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాల నేపథ్యంలో భారీగా వచ్చే యాత్రికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని క్రమబద్ధీకరణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్, అగ్ని ప్రమాదాలు, వరదలు ఇతర విపత్తులను ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు సంబంధిత నిపుణుల సహకారం తీసుకోవాలన్నారు. విపత్తుకు ముందు, విపత్తు జరిగిన సమయంలో, ఆ తర్వాత టీటీడీలోని ప్రతి విభాగం తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి వివరించారు. ఒక్కోరకం విపత్తుకు ఒక అధికారిని ఏర్పాటుచేసి వారితో తరచూ సమావేశాలు నిర్వహించి విపత్తుల నివారణ ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
డా. నాగరాజు, శ్రీ అమల్ కృష్ణ మాట్లాడుతూ టీటీడీలోని పలు విభాగాల్లో విపత్తుల నివారణ ఎలా చేయవచ్చు, అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను కూలంకషంగా డాక్యుమెంటులో పొందుపరిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈవో వారిని అభినందించి శ్రీవారి ప్రసాదంతో సన్మానించారు.
ఈ డాక్యుమెంటులో క్యూలైన్ల క్రమబద్ధీకరణ, ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వ్యూహాలు, ఉత్సవాల నిర్వహణ, మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, దివ్యాంగుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు ప్రకృతి విపత్తులు, మానవ తప్పిదాల వల్ల జరిగే విపత్తులు, అగ్నిప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాలు, తాగునీరు, కల్తీ ఆహారం, అపరిశుభ్రత వల్ల కలిగే విపత్తులు, ఘాట్ రోడ్లు, నడకదారుల్లో సంభవించే విపత్తుల నివారణ చర్యలను పొందుపరిచారు.
జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, సీఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.