PROTECTING THE SANCTITY OF TIRUMALA IS EVERYONE’S RESPONSIBILITY -EO _ తిరుమల పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత- డయల్ యువర్ ఈవోలో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత
– ఆన్ లైన్ లో 2 లక్షలు, ఆఫ్ లైన్‌లో 5 లక్షల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు
– డయల్ యువర్ ఈవోలో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 2023 అక్టోబరు 06: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రత, విశిష్టతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో 25 మంది భక్తులతో ఫోన్‌లో మాట్లాడారు. వారు ఇచ్చిన సలహాలు, సూచనలు విన్నారు. ఇందులో నగరికి చెందిన ప్రకాష్ అనే భక్తుడు మాట్లాడుతూ, తిరుమలలోని మీడియా ప్రతినిధులు కొందరు రాజకీయ పరమైన ప్రశ్నలు అడుగుతున్న కారణంగా పలువురు రాజకీయ నాయకులు ఆధ్యాత్మిక క్షేత్రంలో రాజకీయ విమర్శలు చేయడం బాధాకరమన్నారు. అందుకు ఈవో స్పందిస్తూ, శ్రీవారి ఆలయ పవిత్రతను , వైభవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి ధర్మమన్నారు. మీడియా ప్రతినిధులు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే రాజకీయ ప్రముఖులను వారి ఆధ్యాత్మిక అనుభూతులను గురించి ప్రశ్నలు వేస్తే బాగుంటుందని సూచించారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో ప్రతి ఒక్కరు టీటీడీకి సహకారం అందించాలని ఈవో కోరారు.
1.ప్రకాష్ – నగరి
ప్రశ్న : తిరుప్పావడ సేవా టికెట్ తోపాటు జిలేబి వేరుగా కొనుగోలు చేయాల్సి వస్తోంది.
– తమిళనాడు నుంచి వేలాదిగా నడిచి వస్తున్న భక్తులకు బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా గ్యాలరీ, సౌకర్యాలు ఏర్పాటు చేయండి.
– తిరుమలలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఒకరు పొగ తాగుతున్నడాన్ని గమనించాను.
– అలిపిరి చెక్ పాయింట్ వద్ద టీటీడీ ఉద్యోగులు బస్సు దిగి తనిఖీలు చేసుకోవడం లేదు.
ఈవో : తిరుప్పావడ సేవా మరియు దర్శనం టికెట్ రూ.850-, కావున జిలేబి కావాలసినవారు రూ.500-తో వేరుగా కొనుగోలు చేయాలి.
– గ్యాలరీలలో ఎవరైన కూర్చోవచ్చు.
– మీరు దగ్గరలోని విజిలెన్స్ సిబ్బందికి తెలియజేయాలి.
– టీటీడీ ఉద్యోగులు 100 శాతం అంకిత భావంతో సేవలందిస్తున్నారు. కావున వారి విధులకు ఆలస్యం కాకుడదని తనిఖీలు ఉండవు.
2. శ్రీహరి – ప్రకాశం
ప్రశ్న : వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు సంబంధించిన దర్శన టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు.
ఈవో : డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు 2 లక్షల వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లను త్వరలో ఆన్ లైన్ లో విడుదల చేస్తాం. అదేవిధంగా 5 లక్షల టికెట్లు ఆఫ్‌లైన్ ఇస్తాం.
3. గణపతి – పాండిచ్చేరి
ప్రశ్న : ఎస్ ఎస్ డి టోకెన్ల వివరాలు ఆన్‌లైన్లో విడుదల చేయండి.
ఈవో : తిరుపతిలో ఏ రోజు దర్శనానికి ఆ రోజే ఎస్ ఎస్ డి టోకెన్లు జారీ చేస్తారు. కావున వీలు కాదు.
4. గిరిధర్ – బెంగుళూరు, నరేష్ – మదనపల్లి
ప్రశ్న : ఎలక్ట్రానిక్ డిప్ సేవా టికెట్ల బుకింగ్‌లో పాత విధానం బాగుంది. తిరిగి ప్రవేశ పెట్టండి.
శ్రీవారి ఆర్జిత సేవలు అడ్వాన్స్ బుకింగ్ ప్రవేశ పెట్టండి.
ఈవో : ఎలక్ట్రానిక్ డిప్ సేవా విధానంలో కొత్త విధానం లేదు. ప్రతి నెలా పరిశీలించి తిరుమలలో డిప్ విధానంలో కేటాయిస్తున్నాం.
– 2050వ సంవత్సరం వరకు శ్రీవారి ఆర్జిత సేవలు అడ్వాన్స్ బుకింగ్ పూర్తయ్యాయి. శ్రీవారి అనుగ్రహంతో లక్కీడిప్ లో పొందవచ్చు.
5. సత్యనారాయణ – కరీంనగర్
ప్రశ్న : తిరుమలలో ఉచిత బస్సుల్లో రాబోవు స్టాపింగ్ గురించి ముందుగానే అనౌన్స్‌మెంట్ చేస్తే భక్తులకు సౌకర్యావంతంగా ఉంటుంది.
అన్నప్రసాద భవనంలో భక్తులు కూర్చోకముందే భోజనాలు వడ్డిస్తున్నారు. అందువల్ల అహార పదార్థాలు చల్లగా అయిపోతున్నాయి.
ఈవో : ఉచిత బస్సులలో రాబోవు స్టాపింగ్ గురించి ముందుగానే అనౌన్స్‌మెంట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తాం.
తిరుమలలో ప్రతి రోజు లక్ష మందికి పైగా భక్తులకు అన్నప్రసాదాలు అందించాలి, కావున కూర్చున తరువాత వడ్డించడం అనేది సాద్ధ్యం కాదు.
6. అనిత – చిత్తూరు
ప్రశ్న : అంగప్రదక్షిణ టికెట్లు 3 నెలలు ముందుగా విడుదల చేస్తున్నారు. మహిళలకు ఇబ్బందిగా ఉంది, కావున ఆఫ్‌లైన్‌లో ఇవ్వండి.
ఈవో : అంగప్రదక్షిణ టికెట్ల కోటా పరిమితంగా ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో ఎక్కువమంది క్యూలో వేచి ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. కావున ఆన్లైన్‌లో బుక్ చేసుకోండి.
7. సాంబశివరావు – తెనాలి
ప్రశ్న : పరకామణి సేవకులకు ప్రతి రోజు శ్రీవారి దర్శనం కల్పించండి.
ఈవో : శ్రీవారి సేవకులకు, పరకామణి సేవకులకు ఒక సారి శ్రీవారి దర్శనం, ఒక లడ్డూ ఇస్తున్నాం. కావున రోజు కల్పించడం వీలు కాదు.
8. ధర్మరాజురెడ్డి – మధురై
ప్రశ్న : ఇ – దర్శన కౌంటర్లలో దర్శన టికెట్లు ఇవ్వండి.
ఈవో : ప్రస్తుతం అందరికి ఇంటర్నేట్ అందుబాటులోకి వచ్చింది. కావున దర్శనం టికెట్లు ఆన్‌లైన్ లో బుక్ చేసుకోవాలి.
9. ఉమా – హైదరాబాద్
ప్రశ్న : ఎస్వీబిసిలో నాదనీరాజనం వేదికపై జరిగే సంగీత, నృత్య కార్యక్రమాల టైం స్లాట్ మార్చండి. చిన్న పిల్లకు చూపలేక పోతున్నాం.
ఈవో : వీలుకాదు. యూ ట్యూబ్‌లో చూపించండి.
10. చంద్రశేఖర్ – విశాఖపట్నం
ప్రశ్న : కల్యాణకట్టలో తలనీలాల సమర్పణకు క్షురకులు డబ్బులు అడుగుతున్నారు.
ఈవో : భక్తులను డబ్బులు డిమాండ్ చేసే వారిపై చర్యలు తీసుకున్నాం. భక్తులు ఎవ్వరు కూడా క్షురకులకు, గదుల వద్ద లగేజి కౌంటర్ల వద్ద ఉన్న సిబ్బందికి డబ్బులు ఇవ్వకూడదు.
11. ప్రవీణ్ – చిత్తూరు
ప్రశ్న : తిరుమలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలకు అనుమతివ్వండి.
ఈవో : ఇటీవలే టీటీడీ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు తిరుమలలో సేవలందించేందుకు అనుమతించాం.
12. ఫకీరప్ప – కర్నూలు
ప్రశ్న : తిరుమలలో సేవలు చాలా బాగున్నాయి.
ఈఓ : సంతోషం, ధన్యవాదాలు.
13. శ్రీకాంత్ – మంచిర్యాల
ప్రశ్న : గత 6 నెలలుగా సప్తగిరి మాసపత్రిక జీవిత చందా కట్టాము. అందడం లేదు. మా గ్రామంలో శ్రీవారి ఆలయ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. లేఖ పంపించాము. ఆర్థిక సహాయం చేయండి.
ఈఓ : శ్రీవాణి నిధుల ద్వారా ఆలయ పునర్నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తాం. సప్తగిరి మాసపత్రిక ప్రతినెలా అందేలా ఏర్పాటు చేస్తాం.
14. శ్రీహరి – హైదరాబాద్
ప్రశ్న : పరకామణి సేవ లేదా లడ్డూ సేవ చేయాలనుకుంటున్నాను.
ఈఓ: మీకు పరకామణి సేవ చేసే అవకాశం కల్పిస్తాం. వివరాలు మీకు తెలియజేస్తాం.
15. మురళి – చిత్తూరు
ప్రశ్న : ఆన్లైన్లో 90 రోజులు ముందుగా సేవా టికెట్లు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల మహిళలకు ఇబ్బంది అవుతోంది.
ఈఓ : సేవా టికెట్లు, దర్శన టికెట్లు వాయిదా గానీ, రద్దు గానీ చేసుకునే అవకాశం లేదు.
16. రాజేష్ – బెంగళూరు
ప్రశ్న : తిరుమలలోని హోటళ్లలో అధిక ధరలు వసూలు చేస్తున్నారు. నాణ్యత సరిగా లేదు.
ఈవో : వేలంలో అధిక ధరలకు కోట్ చేసి హోటళ్లు పొందుతున్నారు. ఎక్కువ ధరలకు ఆహారం విక్రయిస్తునారు. వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అన్నమయ్య భవన్, నారాయణగిరి ఏపీ టూరిజంకు తక్కువ అద్దెతో కేటాయించాం. ఇక్కడ తక్కువ ధరలకు ఆహార పదార్థాలు భక్తులకు అందిస్తారు.వీటిని పరిశీలించి ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఏర్పాట్లు చేస్తాం.
17. పద్మావతి – తుని
ప్రశ్న : నిజపాద దర్శనం టికెట్ ఆన్లైన్ లక్కీ డిప్ లో ఇవ్వండి.
ఈవో : శుక్రవారం అభిషేకం, అలంకరణ కారణంగా నాలుగు గంటల సమయం అవుతోంది. భక్తులు దర్శనం కోసం అధిక సమయం వేచి ఉంటారు. నిజపాద దర్శనం కోసం మరికొంత సమయం కావాల్సి ఉంటుంది. కావున శుక్రవారం నిజ పాద దర్శనాలను టీటీడీ బోర్డు రద్దు చేసింది.
18. గంగాధర్ – బెంగళూర్
ప్రశ్న : తిరుమలలో టాక్సీ డ్రైవర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారు.
ఈవో : తిరుమల ట్రాఫిక్ సమస్యకు సంబంధించి పలు ప్రతిపాదనలు చేయడం జరిగింది ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తాం, టాక్సీ డ్రైవర్లకు తగిన సూచనలు ఇస్తాం. తిరుమలలో ప్రీపెయిడ్ ట్యాక్సీ కేంద్రాలు ఏర్పాటుకు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందిస్తాం.
19. రవీంద్రబాబు – పాలకొల్లు
ప్రశ్న : ఎస్వీబీసీలో షష్టిపూర్తి కార్యక్రమం తిరిగి ప్రవేశపెట్టండి.
ఈవో : శతమానం భవతి కార్యక్రమంలో జన్మదిన, శుభకార్యాలకు సంబంధించి పంపితే శ్రీవారి ఆశీస్సులు అందిస్తాం.
20. రంజిత్ – కర్నూలు
ప్రశ్న : దర్శన టికెట్లు బుక్ చేసుకునే సమయంలో పేమెంట్ సమస్యలు వస్తున్నాయి, ఇంతలోపు ఆ టికెట్లు అయిపోతున్నాయి.
ఈవో : టీటీడీ వెబ్ సైట్‌లో పేమెంట్ చేసేటప్పుడు సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకుంటాం.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.