GOKULASTAMI IN TTD CELEBRATIONS _ ఆగస్టు 27న టిటిడి స్థానిక ఆలయాలలో గోకులాష్టమి వేడుకలు

Tirupati, 26 August 2024: The local temples of TTD will observe the Gokulastami celebrations on August 27.

The temples of Tiruchanoor, Kapilatheertham, Chandragiri Ramalayam, Govindaraja Swamy, Narayanavanam have spruced up to observe the festival.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 27న టిటిడి స్థానిక ఆలయాలలో గోకులాష్టమి వేడుకలు

తిరుపతి, 2024 ఆగస్టు 26: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వున్న శ్రీ కృష్ణ స్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో, శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వున్న శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, నారాయణవనం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాలలో ఆగస్టు 27వ తేదీ గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. అదేవిధంగా ఆగష్టు 28వ తేదీ ఉట్లోత్సవం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తిరుచానూరులోని శ్రీ కృష్ణ స్వామివారి ఆలయంలో…..

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీ కృష్ణ స్వామివారి ఆలయంలో ఆగస్టు 27వ తేదీన గోకులాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొదటిరోజు గోకులాష్టమి ఆస్థానం, రెండో రోజు ఉట్లోత్సవం నిర్వహించనున్నారు.

గోకులాష్టమి రోజున ఉదయం శ్రీకృష్ణస్వామి మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహిస్తారు. శ్రీ కృష్ణ‌స్వామి ముఖ మండ‌పంలో మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు శ్రీ కృష్ణ స్వామి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ జ‌రుగ‌నుంది. రాత్రి 7 నుండి 8.15 గంట‌ల వ‌ర‌కు స్వామివారు పెద్దశేష వాహ‌నంపై ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి క‌టాక్షించ‌నున్నారు. అనంతరం రాత్రి 8.30 నుండి 9 గంటల‌ వరకు గోపూజ‌, గోకులాష్ట‌మి ఆస్థానం నిర్వ‌హిస్తారు.

అదేవిధంగా ఆగష్టు 28న ఉట్లోత్స‌వంను పుర‌స్క‌రించుకొని మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, త‌రువాత ఊంజల్‌సేవ జ‌రుగ‌నుంది. సాయంత్రం 6.15 నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు స్వామివారికి ఉట్లోత్స‌వం, ఆస్థానం నిర్వహిస్తారు.

తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో…..

శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మంగళవారం సాయంత్రం 4.30 నుండి సాయంత్రం 6.30 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామివారికి అభిషేకం, అనంతరం బంగారు వాకిలి చెంత పురాణ ప్రవచనం, గోకులాష్టమి ఆస్థానం, నివేదన నిర్వహించనున్నారు.

కపిలతీర్థం వద్ద వున్న శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో…..

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామివారి వీధి ఉత్సవం, రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.

నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో…..

నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం సాయంత్రం 5 నుండి 7.30 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామివారికి అభిషేకం, అనంతరం గోకులాష్టమి ఆస్థానం, నివేదన చేయనున్నారు.

ఆగష్టు 28వ తేదీ ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు శ్రీ కృష్ణస్వామివారి వీధి ఉత్సవం, సాయంత్రం 5 గంటలకు ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఈ రెండు రోజుల్లో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.