GOVINDARAJA SWAMY ASTHANAM HELD _ ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆస్థానం
ANNAMAIAH VARDHANTI FETE CONCLUDED
TIRUPATI, 01 APRIL 2022: The 519th Annamacharya Vardhanti fete organized in a big manner by TTD concluded on Friday.
A literary event was conducted under the presidentship of Prof. Muniratnam at Annamacharya Kalamandiram in Tirupati.
Speaking on the occasion he said, the folklore in Annamaiah Sankeertans has a huge mass appeal and hence they created immense impact on the society during his times.
Scholars Dr Dhulipala Mahadevamani, Dr Samudrala Venkata Ranga Ramanujacharyulu, Annamacharya Project Director Dr A Vibhishana Sharma also spoke on the occasion.
Later Sri Govinda Raja Swamy Asthanam was performed to the utsava deities that arrived from Sri Govindaraja Swamy temple which has been under practice since several decades.
In the evening, Sri Ananda Bhattar vocal concert will take place while at Mahati Sri B Raghunath devotional music followed by Bharata Natyam by Smt Shasikala will be performed.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జానపదాలకు పట్టం కట్టిన అన్నమయ్య : ఆచార్య కె.మునిరత్నం
ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆస్థానం
ముగిసిన అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు
తిరుపతి, 2022 ఏప్రిల్ 01: పదకవితా పితామహుడైన శ్రీ తాళ్లపాక అన్నమయ్య శ్రీవారి వైభవాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని పల్లె ప్రజలకు చేరువ చేసేందుకు వీలుగా తన సంకీర్తనల్లో జానపదాలకు పట్టం కట్టారని ఎస్వీయు తెలుగు విభాగం విశ్రాంతాచార్యులు ఆచార్య కె.మునిరత్నం పేర్కొన్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య 519వ వర్ధంతి ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి.
చివరి రోజున ఆచార్య కె.మునిరత్నం అధ్యక్షతన సాహితీ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన అన్నమయ్య సంకీర్తనల్లో జానపద గేయ ధోరణులు అనే అంశంపై ఉపన్యసించారు. తందనాన అహి…, చక్కని తల్లికి ఛాంగుభళా… తదితర సంకీర్తనల్లో అన్నమయ్య పల్లెభాషను, జానపదాలను జోడించారని తెలిపారు. 500 సంవత్సరాల క్రితం పదసాహిత్యాన్ని విస్తృతంగా వెలువరించిన అన్నమయ్య కారణజన్ముడన్నారు.
రాజమండ్రికి చెందిన ఏవైఎస్ కళాశాల విశ్రాంతాచార్యులు డా. ధూళిపాళ మహాదేవమణి అన్నమయ్య విరచిత శ్రీ వేంకటేశ్వర శతకం అనే అంశంపై మాట్లాడుతూ అన్నమయ్యకు పద్యం రాయగలిగిన పాండిత్యం ఉన్నా సామాన్య ప్రజల స్థాయిని దృష్టిలో ఉంచుకుని పదకవిత్వానికి పెద్దపీట వేశారని చెప్పారు. ఈ శతకంలోని అన్నమయ్య పద్యశైలి, సొబగులు అద్భుతమని తెలియజేశారు.
శంషాబాద్‌లోని జీవా వైదిక సంశోధన ప్రకాశన విభాగం సంచాలకులు డా. సముద్రాల వెంకట రంగరామానుజాచార్యులు అన్నమయ్య సంకీర్తనల్లో సామాజిక సందేశం అనే అంశంపై మాట్లాడుతూ కవి కూడా సమాజంలో భాగమేనని, సమాజాన్ని వదిలి సాహితీ రచన ఉండదని చెప్పారు. అప్పటి సమాజంలోని అనేక రుగ్మతలను బాహాటంగా విమర్శించి ప్రజల మన్ననలు చూరగొన్న ప్రజాకవి, అభ్యుదయ కవి, సంఘసంస్కర్త అన్నమయ్య అన్నారు.
అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ మాట్లాడుతూ అన్నమయ్యది కవి కుటుంబమని, వారి వారసులు దాదాపు 200 సంవత్సరాల పాటు సాహితీ సేవ చేశారని కొనియాడారు. తిరుపతి, తిరుమల, తాళ్లపాకలో ఐదు రోజుల పాటు జరిగిన వర్ధంతి ఉత్సవాలు ముగిశాయన్నారు. అనంతరం ఉపన్యాసకులతోపాటు అన్నమయ్య 11వ తరమైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులను శాలువ, శ్రీవారి ప్రసాదంతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి శ్రీ రేమిళ్ల రామకృష్ణశాస్త్రి, విశ్రాంతాచార్యులు ఆచార్య సర్వోత్తమరావు, సికింద్రాబాద్‌లోని వేదాంతవర్ధిని కళాశాల ప్రిన్సిపాల్ డా. హేమంత్‌కుమార్, ఏఈవో శ్రీ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆస్థానం
శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వర్ధంతి ఉత్సవాల్లో చివరి రోజు ఉదయం అన్నమాచార్య కళామందిరంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆస్థానం ఘనంగా జరిగింది. భక్తుడి చెంతకు భగవంతుడు రావడం అనే ఆర్యోక్తికి తార్కానంగా శ్రీ వేంకటేశ్వరస్వామికి పరమభక్తుడైన అన్నమాచార్యుడు వెలసిన అన్నమాచార్య కళామందిరానికి శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవర్లు వేంచేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. అనంతరం గోవిందరాజస్వామివారిపై అన్నమయ్య రచించిన సంకీర్తనలను ప్రాజెక్టు కళాకారులు సుమధురంగా ఆలపించారు.
అంతకుముందు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను ఆలయం నుండి ఊరేగింపుగా నాలుగు కాళ్ల మండపం, తీర్థకట్టవీధి మీదుగా అన్నమాచార్య కళామందిరానికి తీసుకొచ్చారు. ఆస్థానం అనంతరం తిరిగి ఉత్సవమూర్తులను శ్రీగోవిందరాజస్వామివారి ఆలయానికి తీసుకెళ్లారు.
కాగా సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు విశ్రాంత గాయకులు శ్రీ ఎస్వీ ఆనందభట్టర్ బృందం సంగీత సభ, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి రమ్యకృష్ణ బృందం రుక్మిణీ కళ్యాణం హరికథ పారాయణం చేస్తారు.
మహతి కళాక్షేత్రంలో…
మహతి కళాక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ బి.కేశన్న బృందం మంగళధ్వని, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ బి.రఘునాథ్ బృందం సంగీత సభ, రాత్రి 7.15 నుండి 8.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన శ్రీమతి వికె.శశికళ బృందం భరతనాట్యం కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.