HANUMANTHA VAHANAM _ హనుమంత వాహనంపై శ్రీవారి అభయం

On the Sixth day of ongoing Brahmotsavam at TTDs Sri Kalyana Venkateswara Swamy Temple in Srinivasa Mangapuram near Tirupati, the processional deity of Lord Kalyana Venkateswara Swamy is taken out in procession around four mada streets atop Hanumantha Vahanam on wednesday morning.
 
Sri P.Venkatarami Reddy, Joint Executive Officer, DyEO(Local Temples) Smt. Reddamma, Sri Sudhakar Rao, Supdt Engg, Sri K.S.Narayana Chary, Archaka, Temple staff and  large number of devotees took part.

హనుమంత వాహనంపై శ్రీవారి అభయం

తిరుపతి, మార్చి 6, 2013: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధవారం ఉదయం శ్రీనివాసుడు వేంకటరాముడై హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనసేవ ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు ఉదయం స్వామివారు వరదహస్తం దాల్చిన కల్యాణ వేంకటరాముడై హనుమంతునిపై ఆసీనుడై భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించాడు. భవిష్యోత్తర పురాణంలోని వేంకటాచల మహత్మ్యంలో శ్రీవారు వేంచేసిన పుట్ట – కౌసల్య, చింతచెట్టు – థరథుడు, శేషాచలం – లక్ష్మణుడు, పర్వతప్రాంతం – అయోధ్య అని పేర్కనబడింది. శ్రీరాముడు హనుమంతుని భుజస్కంధాలపై అధిరోహించిన సన్నివేశాలు శ్రీమద్రామాయణంలో ఉన్నాయి. ఈ ఉత్సవంలో వాహనంగా హనుమంతుడిని, వాహనాన్ని అధిష్టించిన కల్యాణ వేంకటరాముడిని దర్శించడం వల్ల భోగమోక్షాలు, జ్ఞానవిజ్ఞానాలు, అభయారోగ్యాలు కలుగుతాయి.

అనంతరం సాయంత్రం 4.00 గంటల నుండి 6.00 గంటల వరకు శ్రీవారి కల్యాణమండపంలో వసంతోత్సవం వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు శ్రీవారు ఆరోరోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతాడు. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతం. స్వామి ప్రణవరూపుడు, విశ్వాకారుడూ, విశ్వాధారుడూ కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచితం. ఈ ఉత్సవం మనలోని అహంకారం తొలగితే మనపై రక్షకుడుగా భగవంతుడుంటాడనే సంగతి గుర్తు చేస్తుంది.

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఉదయం శ్రీమతి పి.పార్వతి శ్రీ విష్ణు లక్ష్మీ సహస్రనామ పారాయణం, శ్రీ ప్రశాంత్‌ పురాణ ప్రవచనం, శివరత్నం సంప్రదాయ భక్తి సంగీతం కార్యక్రమాలు జరిగాయి. మధ్యాహ్నం తిరుపతికి ఆచార్య హెచ్‌.ఎస్‌.బ్రహ్మానంద ధార్మికోపన్యాసం, మదనపల్లికి చెందిన శ్రీమతి సుజాత హరికథ వినిపించారు. సాయంత్రం శ్రీ ప్రమోద చైతన్యస్వామి ఆధ్యాత్మికోపన్యాసం, అన్నమాచార్య ప్రాజెక్టు గాయకులు శ్రీ జి.మధుసూదనరావు అన్నమయ్య విన్నపాలు సంగీత కచేరి నిర్వహించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.