MAKARA VAHANAM _ మకర వాహనంపై కపిలతీర్థ విభుడు

Processional deities of Lord Kapileswara Swamy along with Goddess Parvathi were taken around on Makara Vahanam as part of ongoing Brahmotsavam in Sri Kapileswara Swamy Temple, Tirupati on Wednesday morning.

మకర వాహనంపై కపిలతీర్థ విభుడు

తిరుపతి, మార్చి 6, 2013: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయక నగర్‌ ఎల్‌ టైప్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. వాహనసేవలో భక్తజన బృందాల చెక్కభజనలు ఆకట్టుకున్నాయి.

మకరం గంగాదేవికి నిత్యవాహనం. గంగ పరమశివుని శిరస్సుపై నివసిస్తున్నది. గంగాదేవి వాహనమైన మకరం తపమాచరించి శివానుగ్రహాన్ని పొంది ఆ పరమశివునికి వాహనమైందని శైవాగమాలు తెలియజేస్తున్నాయి. మకరం జీవప్రకృతికి ఉదాహరణ. భగవంతుని ఆశ్రయించినంత వరకు జీవుడు నీటిలో మొసలిలా బలపరాక్రమంతో జీవించవచ్చును.

అనంతరం ఉదయం 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ స్కోమస్కందమూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.
సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు శేష(నాగ) వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు. వేంకటాచలంపై శిలలన్నీ ఆదిశేషుని పడిగలే. శ్రీ కూర్మం మీద ఆదిశేషుడు – ఆ ఆదిశేషునిపై భూమండలం – ఆ భూమిని ఛేదించుకుని పైకి వచ్చిన పాతాళ మహాలింగం కపిలమహర్షిచే పూజింపబడింది. ఆ లింగం వెలసిన ఈ ప్రదేశం కైలాసం వంటి మహిమాన్విత దివ్యక్షేత్రం. ఆదిశేషుని పడగలపైనున్న మణులతో కపిలలింగం, నిరంతరం దీపకైంకర్యాన్ని అందుకుంటున్నది.
ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డెమ్మ, కపిలేశ్వరాలయ సూపరింటెండెంట్‌ శ్రీ సురేష్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కె.శ్రీనివాసులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.