KAISIKA DWADASI HELD _ శ్రీ‌వారి ఆల‌యంలో కైశికద్వాదశి ఆస్థానం

Tirumala, 27 Nov. 20: The yearly fete of Kaisika Dwadasi Asthanam was held at Tirumala on Friday.

Following the inclement weather, the deities of Sri Ugra Sreenivasamurthy, Sridevi and Bhudevi were paraded within the temple circumambulating Dhwajasthambham and Kaisika Dwadasi Asthanam was held at Bangaru Vakili.

Both the Senior and Junior Pontiffs of Tirumala, Board Member Sri Meda Mallikarjuna Reddy, Sri Govind Hari, Additional EO Sri AV Dharam Reddy participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి ఆల‌యంలో కైశికద్వాదశి ఆస్థానం

తిరుమల, 2020 న‌వంబ‌రు 27: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శుక్ర‌వారం కైశిక ద్వాదశి ఆస్థానం జ‌రిగింది. తిరుమ‌ల‌లో వ‌ర్షం, ఈదురుగాలుల కార‌ణంగా మాడ వీధుల్లో ఊరేగింపును టిటిడి ర‌ద్దు చేసింది. ఉదయం 4.45 గంటలకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తిని ఆల‌యంలో ధ్వ‌జ‌స్తంభం చుట్టూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆనంత‌రం స్వామి, అమ్మ‌వార్ల‌ను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ప్రాశ‌స్త్యం..

పురాణాల ప్ర‌కారం శ్రీ‌వైష్ణ‌వ క్షేత్రాల్లో నిర్వ‌హించే ముఖ్య‌మైన ప‌ర్వ‌దినాల్లో కైశిక‌ద్వాద‌శి ఒక‌టి. శ్రీ వ‌రాహ పెరుమాళ్ కైశిక‌పురాణంలోని 82 శ్లోకాల‌తో శ్రీ భూదేవికి క‌థ‌గా చెప్పిన రోజును కైశిక ఏకాద‌శిగా పిలుస్తారు. ఈ క‌థ ఆధారంగా కైశిక ద్వాద‌శి ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది.

నంబ‌దువాన్ క‌థ‌…

కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్‌ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్‌ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, బోర్డు స‌భ్యులు శ్రీ మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి, అద‌నపు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.