LORD RIDES SIMHA VAHANAM AS NARASIMHA _ సింహ వాహనంపై యోగ నరసింహుని అవతారంలో శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

Srinivasa Mangapuram, 16 February 2020: The annaul Brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram entered the third day as Lord took celestial ride on Simha Vahanam in Narasimha Avatara.

The majestic procession became spectacular with caparisoned elephants, horses, bhajan teams, kolatas, mangala vadyams, Chandra melam, Teenmaar dance and chakka bhajans and devotees offering Haratis at every step.

Simha, the Lion carrier is an indication of dignity and bravery and lord Narasimha in this half human and half lion avatar completed His task of punishing the evil and protecting the good.

DyEO Sri Yellappa, AEO Dhananjayulu, superintendent Sri Chengalrayulu, chief archaka Sri Balaji Rangacharyulu, inspector Sri Anil Kumar and devotees participated.

 ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

సింహ వాహనంపై యోగ నరసింహుని అవతారంలో శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

తిరుపతి, 2020 ఫిబ్ర‌వ‌రి 16: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం ఉదయం అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ నరసింహుని అవతారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహంపై కూర్చొని ఊరేగుతారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతాలవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారి నిరూపిస్తున్నారు.

కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళయే అనుకూలం. అందుకే కల్యాణ శ్రీనివాసునికి మూడో రోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్ని పెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. మాంసమయమైన ఈ శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి మిక్కిలి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని  తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.
         

ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ఎల్ల‌ప్ప‌, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్‌  శ్రీ చెంగ‌ల్రాయులు, ప్రధాన అర్చ‌కులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల ప్రత్యేకం

సింహ వాహన‌సేవ‌లో ఆక‌ట్టుకున్నచండ మేళం, తిన్‌మార్ డ్ర‌మ్స్‌

శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఆదివారం ఉదయం సింహ వాహ‌న‌సేవ‌లో చండ మేళం, తిన్‌మార్ డ్ర‌మ్స్‌, కోలాటం త‌దిత‌ర క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస‌సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటుచేశారు.

35 ఏళ్లుగా కేర‌ళ గోవింద‌మ‌ణి చండ‌మేళం

కేర‌ళ రాష్ట్రం కొళ్లాం ప్రాంతంలోని కొడ‌గ‌ల్‌కు చెందిన శ్రీ గోవింద‌మ‌ణి బృందం 35 ఏళ్లుగా శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల్లో చండ‌మేళం(కేర‌ళ డ్ర‌మ్స్‌) వాయిస్తున్నారు. ఈ బృందంలో మొత్తం 12 మంది క‌ళాకారులు ఉన్నారు. వీరు డ్ర‌మ్స్‌, తాళాలు ల‌య‌బ‌ద్ధంగా వాయిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేస్తారు. ఈ వాయిద్య ప్ర‌ద‌ర్శ‌న ఎంతో విన‌సొంపుగా ఉంటుంది. వీరు టిటిడి ఆధ్వ‌ర్యంలోని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, తిరుప‌తిలోని శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యం, శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీ కోదండ‌రామాల‌యం, అప్ప‌లాయ‌గుంట‌లోని శ్రీ ప్ర‌స‌న్న‌వేంక‌టేశ్వ‌రాల‌యం, ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామాల‌యంలో జ‌రిగే బ్ర‌హ్మోత్స‌వాల్లోనూ చండ మేళం వాయిస్తారు.

తిన్‌మార్ డ్ర‌మ్స్‌

తూర్పుగోదావ‌రి జిల్లా వి.య‌ర్ర‌పాళ్యంకు చెందిన శ్రీ‌నివాస భ‌జ‌న‌మండ‌లి స‌భ్యులు తిన్‌మార్ డ్ర‌మ్స్‌తో భ‌క్తుల‌ను విశేషంగా ఆకర్షించారు. మొత్తం 15 మంది క‌ళాకారులు లయబద్ధంగా డ్రమ్ములు వాయిస్తూ భక్తులను ఆకట్టుకున్నారు.
         
అదేవిధంగా, తూర్పుగోదావ‌రి జిల్లా వి.య‌ర్ర‌పాళ్యంకు చెందిన శ్రీ సీతా రామాంజ‌నేయ కోలాట భ‌జ‌న మండ‌లి స‌భ్యుల బృందం 75 మంది క‌ళాకారుల‌తో  కోలాట నృత్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇందులో 6 సంవ‌త్స‌రాల నుండి 14 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గ‌ల విద్యార్థిని విద్యార్థులు కోలాటం ప్రదర్శన చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.