PRASANNA VENKATESWARA MUSES IN MOHINI AVATARA_ మోహినీ అవతారంలో సర్వలోక రక్షకుడు
Appalayagunta, 17 Jun. 19: On the fifth day morning, Sri Prasanna Venkateswara Swamy Utsava Idol was taken on a procession in a finely decked palanquin in Mohini Avatara.
This guise of Lord is considered to be unique as He takes the form of Universal Celestial Damsel, Mohini to save the world from demons by giving nectar to Gods.
Temple DyEO Smt. Jhansi Rani and other staff and a large number of devotees took part.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మోహినీ అవతారంలో సర్వలోక రక్షకుడు
తిరుపతి, 2019 జూన్ 17: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన సోమవారం ఉదయం గోవిందుడు మోహినీ అవతారంలో పల్లకీలో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పల్లకీ ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు ఉదయం సకల లోక కల్యాణకారకుడు అయిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు దివ్యమోహినీ రూపంలో ఉత్సవమూర్తియై భక్తులను తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహకభేదాన్ని గుర్తుంచుకోలేకపోయింది. కనుక శ్రీవారు జగన్మోహినియై పల్లకీలో కూర్చొని ఉంటారు. ఈనాటి శ్రీవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తుంది.
అనంతరం ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో అబిషేకం చేశారు.
కాగా సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.30 నుండి 10.00 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ గోపాలకృష్ణా, కంకణభట్టార్ శ్రీసూర్యకుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అప్పలాయగుంట శ్రీచంద్రమౌళిశ్వరస్వామివారికి పట్టు వస్త్రలు బహూకరణ
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం రాత్రి గరుడ వాహనాన్ని పురష్కరించుకుని ఉదయం ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి అప్పలాయగుంటలోని శ్రీచంద్రమౌళిశ్వరస్వామివారికి పట్టు వస్త్రలు బహూకరించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.