SUGUNABHI RAMA AS MOHINI_ పల్లకీపై మోహినీ అవతారంలో శ్రీ కోదండరాముడు

TIRUPATI, 24 MARCH 2023: As part of the ongoing annual Brahmotsavam at Tirupati Sri Kodandaramaswamy temple, on the Fifth day on Friday, Sri Ramachandra Murthy as celestial beauty Mohini blessed devotees on the beautifully decked Palanquin.

HH Sri Chinna Jeeyangar Swamy of Tirumala, DyEO Smt Nagaratna, AEO Sri Mohan, Kankanabhattar Sri Anandakumar Dixitulu and others participated.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పల్లకిపై మోహిని అలంకారంలో కోదండరాముడు

తిరుపతి, 2023 మార్చి 24: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం ఉదయం మోహిని అలంకారంలో శ్రీరామచంద్రుడు పల్లకిలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.

మోహిని అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణింపబడింది. సురాసురులు అమృతానికై క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో ఏర్పడిన కలహాన్ని నివారించి, అసురులను వంచించి, సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరిస్తారు. తనకు భక్తులు కానివారు మాయకు లోను కాక తప్పదనీ, తనకు ప్రసన్నులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహిని రూపంలో ప్రకటిస్తున్నారు.

వాహన సేవ అనంతరం ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.

రాత్రి 7 నుండి 10 గంటల వరకు గరుడసేవ అత్యంత వేడుకగా జరగనుంది.

వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ మోహన్, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.