PEARL CANOPY GLIDES ALONG MADA STREETS _ ముత్యపుపందిరి వాహనంపై వెన్న దొంగిలించే బాలకృష్ణుడిగా శ్రీ మలయప్ప

TIRUMALA, 17 SEPTEMBER 2026: In the ”Aeni Kannan” Alankaram, Sri Malayappa Swamy blessed His devotees on Mutyapu Pandiri Vahanam.

The processional deity atop the pearl canopy donned the guise ”Sri Krishna climbing ladder to steal Butter from pot”.

Mutyapu Pandiri is often refered to bring peace and tranquility. Devotees were mused to see the Alankaram. 

AP Governor Sri Abdul Nazeer, TTD Chairman Sri B.R.Naidu, EO Sri M.Ravi Chandra, Addl EO Sri Venkaiah Chowdary, CVSO Sri Muralikrishna, Tpt SP Sri Subbrayudu, TTD Board Members and TTD officials participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

ముత్యపుపందిరి వాహనంపై వెన్న దొంగిలించే బాలకృష్ణుడిగా శ్రీ మలయప్ప

ఏణి కన్నన్ అలంకారంలో కనువిందు చేసిన శ్రీవారు 

భక్తులను అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

తిరుమల, 2026 సెప్టెంబరు 17: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ముత్యపుపందిరి వాహనంపై ఏణి కన్నన్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

 నిచ్చెన ఎక్కి వెన్న దొంగిలించే బాలకృష్ణుడి లీలను తలపించే ఈ అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగిన వాహనసేవలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.

పెద్ద సంఖ్యలో భక్తులు మాడ వీధులకు తరలివచ్చి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

ముత్యపుపందిరి వాహనంసకల సౌభాగ్య సిద్ధికి ప్రతీక

జ్యోతిషశాస్త్రంలో ముత్యాలు చంద్రునికి ప్రతీకగా పేర్కొనబడ్డాయి. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్లు పురాణాల్లో ప్రస్తావన ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల పందిరిగా స్వీకరించి శ్రీనివాసుడు భక్తులకు దర్శనమివ్వడం ఈ వాహనసేవ ప్రత్యేకత.

చల్లని ముత్యాల పందిరి కింద కొలువైన శ్రీవారిని దర్శించుకోవడం వల్ల తాపత్రయాలు తొలగి, భక్తుల జీవితాల్లో సుఖశాంతులు, సకల శుభాలు చేకూరుతాయని పురాణ ప్రశస్తి.

ముత్యపుపందిరి వాహనంపై బాలకృష్ణుని మనోహర అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీవారిని చూసి భక్తులు పరవశించారు.

ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్, టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు డా.ఎ.శరత్, శ్రీ ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో శ్రీ కే.వి. మురళీకృష్ణ, పలువురు బోర్డు సభ్యులు, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీ శ్రీధర్ వర్మ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.