PROVIDE GOOD SERVICE TO DEVOTEES AT SRI KT- EO _ శ్రీ కపిలేశ్వరాలయంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలి - టీటీడీ ఈవో
శ్రీ కపిలేశ్వరాలయంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలి - టీటీడీ ఈవో
తిరుపతి, 2024 అక్టోబరు 23: తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయానికి రానున్న కార్తీక మాసంలో విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. టీటీడీ ఈవో బుధవారం సాయంత్రం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఈవో ఆలయం ముందు ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం, కళ్యాణకట్ట, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల విక్రయశాల, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, పుష్కరిణి, క్యూ లైన్లను పరిశీలించి, శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని దర్శించుకుని, పూజలు నిర్వహించారు.
అనంతరం టీటీడీ పంచగవ్య ఉత్పత్తులు, అగర బత్తుల విక్రయ కేంద్రాన్ని పరిశీలించారు. ఆలయంలో పారిశుద్ధ్యం, క్యూ లైన్ల నిర్వహణపై పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయంలో టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులు టిటిడి అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.