PUSHPA YAGAM AT SRIVARI TEMPLE ON NOVEMBER 9 _ నవంబరు 9న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
నవంబరు 9న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
తిరుమల, 2024 నవంబరు 05: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 9న శనివారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. నవంబరు 8న శుక్రవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు.
పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.
మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు
నవంబరు 8న అంకురార్పణ కారణంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.
నవంబరు 9న పుష్పయాగం రోజున కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలు రద్దయ్యాయి. తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.