REVIEW MEETING WITH RAILWAY AUTHORITIES _ రైల్వే స్టేషన్‌లో యాత్రికులకు మెరుగైన వసతులు : తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు
రైల్వే స్టేషన్‌లో యాత్రికులకు మెరుగైన వసతులు : తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు
తిరుపతి, ఏప్రిల్ 08, 2013: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే యాత్రికులకు రైల్వే స్టేషన్‌లో మెరుగైన వసతులు కల్పించేందుకు తితిదే, రైల్వేశాఖ సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తోందని తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు తెలిపారు. తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో సోమవారం ఆయన డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ తేజ్‌పాల్‌సింగ్‌తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తితిదే ఛైర్మన్ మాట్లాడుతూ రైల్వేస్టేషన్ వెనుకగల ధర్మసత్రాలను తొలగించి, ఆ స్థలాన్ని రైల్వే శాఖకు లీజుకు ఇస్తామని, రైల్వే అధికారులు అక్కడ యాత్రికుల వసతి సముదాయం నిర్మిస్తారని తెలిపారు. ఇందుకోసం రైల్వేశాఖ రూ.48 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. ఇందులో యాత్రికులకు అవసరమైన పార్కింగ్, స్నానపు గదులు, లాకర్లు తదితర వసతులు కల్పిస్తామన్నారు.
తితిదే ఈవో మాట్లాడుతూ ఈ నెల పదో తేదీన జిల్లా కలెక్టర్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్, తుడా వైస్‌ఛైర్మన్‌తో సమావేశమై కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రైల్వే స్టేషన్ వెనుక రాయలచెరువు రోడ్డు నుండి ధర్మసత్రాల వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మించి ట్రాఫిక్ ఇబ్బందులను తొలగిస్తామన్నారు. ఇందుకోసం రైల్వే శాఖ రూ.11 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
విలేకరుల సమావేశంలో తితిదే తిరుపతి జెఇఓ శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, సిఈ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, ఎస్‌ఈ శ్రీ సుధాకరరావు ఇతర ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.