అన్నమయ్య సంకీర్తనలతో వ్యక్తిత్వ వికాసం : డాక్టర్‌ సాంబశివరావు

అన్నమయ్య సంకీర్తనలతో వ్యక్తిత్వ వికాసం : డాక్టర్‌ సాంబశివరావు

తిరుపతి, ఏప్రిల్‌  09, 2013: శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలను ప్రతిరోజూ ఆలపించినా, విన్నా వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని గుంటూరుకు చెందిన డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 510వ వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో నిర్వహిస్తున్న సాహితీ సదస్సులు మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి.

తిరుపతిలోని భారతీయ విద్యాభవన్‌ సంచాలకులు శ్రీ సత్యనారాయణరాజు అధ్యక్షతన సాహితీ సదస్సు జరిగింది. డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు ”అన్నమయ్య పద సౌందర్యం” అనే అంశంపై ఉపన్యసిస్తూ అన్నమయ్య పద్య సాహిత్యాన్ని ప్రారంభించి పద సాహిత్యాన్ని సృష్టించడంలో ఒక ప్రత్యేకతను సాధించినట్టు తెలిపారు. శ్రీవారి మీద వేలాది కీర్తనలు రచించినా, భావంలో ఎక్కడా పునరుక్తి లేదని, అన్నీ కొత్తగానే ఉంటాయని అన్నారు. అన్నమయ్య తన రచనల ద్వారా మానసిక విశ్లేషణ చేశారని ఆయన వెల్లడించారు.
తిరుపతికి చెందిన డాక్టర్‌ శాఖమూరి రవిచంద్ర ”అన్నమయ్య సంకీర్తనల్లో ఉట్లోత్సవ ప్రత్యేకత” అనే అంశంపై ప్రసంగిస్తూ అన్నమయ్య కీర్తనల ద్వారా ఉట్లోత్సవానికి ఎనలేని ప్రాచుర్యం లభించిందన్నారు. కృష్ణుడి వేషధారణలో ఉట్టి కొట్టడం వెనక ఉన్న భగవత్‌ తత్వాన్ని అన్నమయ్య సంకీర్తనల్లో వివరించినట్టు తెలిపారు.

తిరుపతిలోని ఎస్వీ ప్రాచ్య కళాశాల తెలుగు అధ్యాపకులు శ్రీ ఇ.జి.హేమంతకుమార్‌ ”అన్నమయ్య సూక్తులు” అనే అంశంపై ప్రసంగిస్తూ ఆ కాలంలోని పలుకుబడులు, జాతీయాలు, నానుడులు, సామెతల్లోని వైశిష్ట్యాన్ని వివరించారు. ఐదు వందల ఏళ్లు గడిచినా అన్నమయ్య సూక్తులు నిత్య నూతనంగా ప్రకాశిస్తున్నాయని ఆయన తెలిపారు. అనంతరం తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ కె.జె.కృష్ణమూర్తి ఉపన్యాసకులను శ్రీవారి ప్రసాదం, శాలువతో సన్మానించారు.

అనంతరం సాయంత్రం 6.00  నుండి 7.30 గంటల వరకు వైజాగ్‌కు చెందిన శ్రీమతి ఆర్‌.మీరా బృందం సంగీత సభ, రాత్రి 7.45 నుండి 9.00 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ పారుపల్లి రంగనాథ్‌ బృందం సంగీత సభ నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్‌ మేడసాని మోహన్‌, శ్రీ తుమ్మపూడి కోటేశ్వరరావు, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.