SACRED UMBRELLA FETE ON AUGUST 12_ ఆగ‌స్టు 12న నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం

Tirumala, 10 Aug. 19: The annual religious fete of Chatrasthapanotsavam will be observed at Tirumala on August 12.

It is believed that Narayanagiri is one among the seven peaks and the highest one where Lord Venkateswara first stepped onto this sacred hills and the devotees can see the set of divine padalu located here.

To mark this ceremonious occasion, TTD observes Chatrasthapanotsavam in Narayanagiri peak every year.
Another belief is also is in vogue. This is the season where the wind blows heavily and Narayanagiri located at the highest point the blow of wing is heavier. To appease wind God, a new set of Chatrams-umbrellas will be offered to Vayudeva from this highest peak point.

Hence this sacred Umbrella festival also assumes importance among 450 festivals that are observed in Tirumala throughout the year.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగ‌స్టు 12న నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం

తిరుమల, 2019 ఆగస్టు 10: తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఆగ‌స్టు 12వ తేదీ సోమ‌వారం ఛత్రస్థాపనోత్సవం జ‌రుగ‌నుంది.

ఈ సందర్భంగా అర్చక బృందం శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడాదికోసారి ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

పురాణ ప్రాశస్త్యం

తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా కాలు మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహిస్తారు.

ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్తారు.

ఛత్రస్థాపనోత్సవాన్ని టిటిడి కొన్ని వందల సంవత్సరాలుగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నారాయణగిరిలోని శ్రీవారి పాదాలకు తిరుమంజనానికి నిర్వహించేందుకు ఆలయంలోని బంగారు బావి నుండి తీర్థమును తీసుకుంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో రెండవ గంట తర్వాత పూజ సామాగ్రి, పుష్పాలు, నైవేద్యానికి ప్రసాదాలు సిద్ధం చేసుకుంటారు. రంగనాయకుల మండపం నుండి గొడుగులతో మంగళవాయిద్యాల నడుమ మహాప్రదక్షిణంగా మేదరమిట్ట చేరుకుంటారు.

అక్కడినుండి అర్చకులు నారాయణగిరి శిఖరం చేరుకుని బంగారుబావి నుండి తెచ్చిన తీర్థంతో శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, అలంకారం, పూజ, నైవేద్యం సమర్పిస్తారు. తదనంతరం వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించి, శ్రీవారి పాదాల చెంత గొడుగును ప్రతిష్టించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.