SIMHA VAHANAM AT JUBILEE HILLS TEMPLE _ సింహ వాహనంపై యోగ నరసింహ స్వామి అలంకారంలో శ్రీనివాసుడు
సింహ వాహనంపై యోగ నరసింహ స్వామి అలంకారంలో శ్రీనివాసుడు
హైదరాబాద్ / తిరుపతి, 2025 ఫిబ్రవరి 28: జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ యోగ నరసింహ స్వామి అలంకారంలో సింహ వాహనంపై అభయమిచ్చారు.
భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి
శ్రీ వేంకటేశ్వరస్వామి వారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా స్వామివారు నిరూపించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రమేష్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు ఉన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది