SURYA NARAYANA SHINES BRIGHT ON SURYA PRABHA VAHANA_ సూర్యప్రభవాహనంపై మెరిసిన శ్రీ సూర్య‌నారాయ‌ణ‌మూర్తి రథసప్తమి వాహ‌న‌సేవ‌లు తిల‌కించేందుకు ల‌క్ష‌లాదిగా విచ్చేసిన భ‌క్తులు

LAKHS WITNESS RADHA SAPTHAMI VAHANA SEVAS

ELABORATE ARRANGEMENTS MADE BY TTD TO PILGRIMS

2000 SEVAKULU DEPLOYED IN FOUR MADA STREETS TO SERVE PILGRIMS
WITH FOOD AND WATER

Tirumala, 12 Feb. 19: The bright sunny day on Tuesday witnessed the first rays of Sun Lord touching the holy feet, chest and fore head of Sri Suryanarayana Murthy at around 6.57am in Tirumala during Surya prabha vahanam as a part of Radhasapthami.

The vahana seva commenced at 5.30am and glided swiftly across the four mada streets. All the 175 galleries are almost jam-packed by 5am itself.

About 2000 sevakulu were deployed on four mada streets to provide anna prasadam, drinking water and man the pilgrim crowd during the procession of vahanams. About 1000 scouts and guides also pressed into service to streamline the pilgrims.

Meanwhile Sri Malayappa Swamy took celestial ride on seven vahanams the entire day with chakra snanam between 2pm and 3pm. The morning vahanams included Surya Prabha between 5.30am and 8am, Chinna Sesha between 9am and 10am, Garuda Vahanam between 11am and 12noon, Hanumantha Vahanam between 1pm and 2pm.

The evening vahana sevas commenced with Kalpavriksha between 4pm and 5pm, Sarvabhupala between 6pm and 7pm and concluded with Chandra prabha vahanam between 8pm and 9pm.

Each mada street is monitored by a senior officer, reputation staffs to ensure hassle free arrangements to pilgrims. The arrangements are reviewed and inspected at regular intervals by TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju and CVSO Sri Gopinath Jetti.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

సూర్యప్రభవాహనంపై మెరిసిన శ్రీ సూర్య‌నారాయ‌ణ‌మూర్తి రథసప్తమి వాహ‌న‌సేవ‌లు తిల‌కించేందుకు ల‌క్ష‌లాదిగా విచ్చేసిన భ‌క్తులు

ఫిబ్ర‌వ‌రి 12, తిరుమల 2019: సూర్య జయంతిని పురస్కరించుకొని మంగ‌ళ‌వారంనాడు తిరుమలలో ‘రథసప్తమి’ ఉత్సవాన్ని టిటిడి రంగరంగ వైభవంగా నిర్వహించింది. శ్రీవారి బ్రహ్మోత్స‌వాల త‌ర‌హాలో తిరుమల క్షేత్రం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. రథసప్తమిని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు శ్రీమలయప్పస్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత‌, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఊరేగే స్వామివారి కమనీయ రూపాన్ని దర్శించడానికి భక్తులు తండోపతండాలుగా విచ్చేశారు. ఈ వాహన‌సేవలతోపాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారుకు మధ్యాహ్నం చక్రస్నానం నిర్వహించారు.

సూర్య‌ప్ర‌భ‌ వాహనం

అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహనసేవ సూర్యప్రభవాహనం ఉదయం 5.30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు జ‌రిగింది. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.57 గంట‌ల‌కు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. ఈ వాహనసేవ అపురూప దృశ్యాన్ని తిలకించడానికి ఉదయాత్పూర్వం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న వేలాది మంది భ‌క్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు భక్తకోటికి సిద్ధిస్తాయి.

ఆకట్టుకున్న బాలమందిరం విద్యార్థుల ‘ఆదిత్యహృదయం’, ‘సూర్యాష్టకం’

రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహనసేవలో టిటిడి శ్రీవేంకటేశ్వర బాలమందిరానికి చెందిన 230 మంది విద్యార్థులు ఆలపించిన ఆదిత్యహృదయం, సూర్యాష్టకం శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తర మాడ వీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు. ఈ శ్లోకాలు పారాయ‌ణం చేయ‌డంపై బాలమందిరం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గతంలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లోనూ విద్యార్థులు శ్రీనివాసగద్యం, వివిధ సంస్కృత శ్లోకాలను ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు.

చిన్నశేష వాహనం

ఉదయం 9 నుండి 10 గంట‌ల వరకు చిన్నశేష వాహనంపై స్వామివారు భ‌క్తుల‌కు క‌నువిందు చేశారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్న శేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

గరుడ వాహనం

ఉదయం 11 నుండి 12 గంట‌ల వరకు గ‌రుడ వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చాడు. అలంకారప్రియుడైన స్వామివారు సర్వాలంకార భూషితుడై, పుష్పమాలాలంకృతుడై ఛత్రచామర సార్వభౌమిక మర్యాదలతో, పక్షిరాజు గరుడునిపై రాజఠీవితో తిరువీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించాడు. శ్రీ‌వారికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన‌ది గ‌రుడ వాహ‌నం. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్పుతున్నాడు.

హనుమంత వాహనం

మధ్యాహ్నం 1 నుండి 2 గంట‌ల వరకు భక్తులకు నిజమైన భక్తిరసం, శరణాగతి నిర్వచనాన్ని తెలియపరచడానికి స్వామివారు భక్తాగ్రేసరుడైన హనుమంతుని వాహనంపై పుణ్యక్షేత్ర మాడ వీధులలో ఊరేగి ఆశీర్వదించాడు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.

కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై శ్రీమలయప్పస్వామివారి అభయం

రథసప్తమి సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల నడుమ చక్రస్నానం వైభవంగా జరిగింది. ఆ తరువాత వరుసగా కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై శ్రీమలయప్పస్వామివారు భక్తులకు అభయమిచ్చారు. శ్రీవరాహస్వామివారి ఆలయం వద్ద గల స్వామిపుష్కరిణిలో చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం నిర్వహించారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్‌ ప్రసన్నుడయ్యాడు. అధికారులు, భక్తులు పుష్కరిణిలో పవిత్రస్నానాలు ఆచరించారు.

కల్పవృక్ష వాహనం

సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.

సర్వభూపాల వాహనం

సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని స్వామివారు అందిస్తున్నారు.

చంద్రప్రభ వాహనం

రాత్రి 8 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు భక్తులను కటాక్షిస్తారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, బోర్డు స‌భ్యులు శ్రీ ఇ.పెద్దిరెడ్డి, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.