Surya Pooja Mahotsavam in Sri Vedanarayana Swamy Temple, Nagalapuram from March 24 _ శ్రీ వేదనారాయణస్వామి సూర్యపూజోత్సవం, తెప్పోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ
Surya Pooja Darshanam will be by 5.30PM to 6.30PM on everyday from March 24th to 25th and Thiruveedhi Utsavam will be by 6.30PM to 8.00PM during the festival.
శ్రీ వేదనారాయణస్వామి సూర్యపూజోత్సవం, తెప్పోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ
తిరుపతి, మార్చి 20, 2013: నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణస్వామివారి ఆలయంలో మార్చి 24 నుండి 28వ తేదీ వరకు జరుగనున్న వార్షిక సూర్యపూజ మహోత్సవం, తెప్పోత్సవాల పోస్టర్లను తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం బుధవారం తన బంగళాలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీమహావిష్ణువు మత్స్యావతార రూపంలో సంవత్సరాల కొలది యుద్ధం చేసి వచ్చినందున, స్వామి దివ్య శరీరానికి వెచ్చదనం కలిగించేందుకు సూర్య భగవానుడు తన కిరణాలను స్వామివారి మీద ప్రసరింపచేయడమే సూర్యపూజోత్సవమని వివరించారు. ఈ ఉత్సవంలో ప్రధాన రాజగోపురం నుండి 630 అడుగుల దూరంలో గల మూలవిరాట్టుపై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిస్తాయని తెలిపారు. మొదటి రోజు స్వామి పాదాలపై, రెండో రోజు నాభిపైన, మూడో రోజు స్వామి శిరస్సుపై సూర్యకిరణాలు ప్రసరించి స్వామి దివ్యరూపాన్ని మరింత తేజోవంతం చేస్తాయన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ అద్భుతాన్ని చూసి తరించాలని కోరారు.
మార్చి 24 నుండి 28వ తేదీ వరకు జరుగనున్న వార్షిక సూర్యపూజ మహోత్సవం, తెప్పోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు భక్తులకు సూర్యపూజ దర్శనం కల్పించనున్నారు. రాత్రి 6.30 గంటల నుండి 8.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరుగనుంది. మార్చి 26 నుండి 28వ తేదీ వరకు సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు తెప్పోత్పవాలు జరుగనున్నాయి. మొదటి రోజు శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామస్వామివారు, రెండు, మూడవ రోజుల్లో శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణస్వామివారు తెప్పలపై విహరిస్తారు. మార్చి 27న తెప్పోత్సవం అనంతరం ముత్యపుపందిరి వాహనంపై, మార్చి 28వ తేదీన తెప్పోత్సవం అనంతరం శేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం ఆధ్యాత్మిక, భక్తి, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ గోపాలకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ వేణుగోపాల్, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.