SURYANARAYANA AS BADARINARAYANA GLITTERS BRIGHT ON SURYA PRABHA VAHANAM _ సూర్యప్రభ వాహనంపై యోగ‌ముద్ర‌లో బ‌ద్రినారాయ‌ణుడు

Tirumala, 6 Oct. 19: Sri Malayappa Swamy who shines bright as Sri Suryanarayana Murthy on Surya Prabha Vahanam, took the celestial form of Badarinayana in Yoga Mundra on the carrier on the bright sunny day on Sunday.

On the seventh day morning of the ongoing annual Brahmotsavams at Tirumala, Lord Malayappa Swamy blessed His devotees on the well decked dazzling Surya Prabha Vahana. 

According to Hindu mythology, Lord Srimannarayana lies in the midst of Surya Mandala which is the Sun’s sphere in the cosmos. Wearing a diamond gauntlet, seated majestically atop the seven horses driving Surya Prabha Vahanam, Sri Malayappa Swamy took a celestial ride along the four mada streets. 

To match the occasion, the Lord was decorated with a huge garland made of red colour ixora flowers which enhanced the beauty of Lord. Devotees were mused by the charm of Lord on Surya Prabha Vahanam.

TTD Chairman Sri YV Subba Reddy, TTD EO Sri Anil Kumar Singhal, Addl EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, ACVO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Lokanadham and others took part.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

 

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

సూర్యప్రభ వాహనంపై యోగ‌ముద్ర‌లో బ‌ద్రినారాయ‌ణుడు

అక్టోబరు 06, తిరుమ‌ల‌, 2019:   కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలలో ఏడో రోజైన ఆదివారం ఉదయం శేషాచలాధీశుడు సూర్యప్రభ వాహనంపై స‌ప్త అశ్వాల‌పై యోగ‌ముద్ర‌లో బ‌ద్రినారాయ‌ణుడి అలంకారంలో తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనసేవ ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సూర్యప్రభ వాహనం – ఆయురారోగ్య‌ప్రాప్తి

 బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ భక్తులను ఆరోగ్యవంతులను చేస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చాడు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత, ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శించే భక్తులకు ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

 అనంతరం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌ సేవ వైభవంగా జరగనుంది.

చంద్రప్రభవాహనంపై సర్వజగద్ర‌క్ష‌కుడు

 బ్రహ్మోత్సవాలలో 7వ రోజు రాత్రి 8 గంటల నుండి 10 గంటల నడుమ శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపనున్నాడు.

చంద్రప్రభవాహనం – మాన‌సిక‌శాంతి ప్రాప్తి

 చంద్రప్రభ వాహనంపై శ్రీవారు దర్శనమిచ్చి తన చల్లని అమృత కిరణాలతో భక్తులను అమృతస్వరూపులను చేస్తారు. నక్షత్రాలకు చంద్రుడు అధిపతి అయితే శ్రీవారు సమస్త విశ్వానికీ అధిపతి. వాహనం చంద్రుడు ఆహ్లాదకారి. శ్రీవారు చంద్రమండల మధ్యస్థుడై పరమాహ్లాదకారి అయ్యాడు. సర్వకళాసమాహారాత్మకుడైన ఆదినారాయణుడు తన కళల నుండి 16 కళలు చంద్రునిపై ప్రసరింపజేసినందున చంద్రుడు కళానిధి అయ్యాడు. చంద్రదర్శనంతో సముద్రం ఉప్పొంగినట్టు, చంద్రప్రభామధ్యస్థుడైన శ్రీకల్యాణచంద్రుణ్ణి దర్శించడంతో భక్తుల హృదయ క్షీరసాగరాలు ఉత్తుంగప్రమోద తరంగాలతో పొంగి ఆనందిస్తాయి. చంద్రప్రభ వాహనంలో శ్రీవారిని దర్శించడం సకలతాపహరం.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ప‌లువురు ధర్మకర్తల మండలి సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అక్టోబ‌రు 7న రథోత్సవం

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమ‌వారం రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 7 గంటలకు ర‌థోత్స‌వం ప్రారంభ‌మ‌వుతుంది. రాత్రి 8 నుండి 10 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.