SURYAPRABHA VAHANAM _ సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడి ప్రకాశం

On the 7th day of ongoing Brahmotsavam at TTDs Sri Kalyana Venkateswara Swamy Temple in Srinivasa Mangapuram near Tirupati, the processional deity of Lord Kalyana Venkateswara Swamy is taken out in procession around four mada streets atop Suryaprabha Vahanam on thursday.
 
TTD Joint Executive Officer Sri P.Venkatarami Reddy, Suptd Engineer Sri Sudhakar Rao, AEO Sri Lakshman Naik, VGO Sri Hanumanthu, Archakar Sri K.S.Narayana Chary, Temple staff and  large number of devotees took part.

సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడి ప్రకాశం

తిరుపతి, మార్చి 7, 2013: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం ఉదయం శ్రీనివాసుడు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనసేవ ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం కల్యాణ సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ భక్తులను ఆరోగ్యవంతులను చేస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిస్తాడు. సూర్యుడు సకలరోగ నివారకుడు. ఆరోగ్యకారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, పండే పంటలు, ఓషధీపతి అయిన చంద్రుడు సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాయి. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం.  ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే కల్యాణ సూర్యనారాయణుడిని దర్శించే భక్తులకు ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతానసంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
అనంతరం సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌ సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఏడో తేదీ రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారు దర్శనమిచ్చి తన చల్లని అమృత కిరణాలతో భక్తులను అమృతస్వరూపులను చేస్తున్నారు. నక్షత్రాలకు చంద్రుడు అధిపతి అయితే శ్రీవారు సమస్త విశ్వానికీ అధిపతి. వాహనం చంద్రుడు ఆహ్లాదకారి. శ్రీవారు చంద్రమండల మధ్యస్థుడై పరమాహ్లాదకారి అయ్యాడు. సర్వకళాసమాహారాత్మకుడైన ఆదినారాయణుడు తన కళల నుండి 16 కళలు చంద్రునిపై ప్రసరింపజేసినందున చంద్రుడు కళానిధి అయ్యాడు. చంద్రదర్శనంతో సముద్రం ఉప్పొంగినట్టు, చంద్రప్రభామధ్యస్థుడైన శ్రీకల్యాణచంద్రుణ్ణి దర్శించడంతో భక్తుల హృదయ క్షీరసాగరాలు ఉత్తుంగప్రమోద  తరంగాలతో పొంగి ఆనందిస్తాయి. చంద్రప్రభ వాహనంలో శ్రీవారిని దర్శించడం సకలతాపహరం. పాపహరం.
ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఉదయం శ్రీ ఎం.రాధాకృష్ణయ్య శ్రీ విష్ణు లక్ష్మీ సహస్రనామ పారాయణం, శ్రీమతి విశాలాక్షి పురాణ ప్రవచనం, టి.శ్రీప్రియ బృందం సంప్రదాయ భక్తి సంగీతం కార్యక్రమాలు జరిగాయి. మధ్యాహ్నం ఆళ్వార్‌దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ధార్మికోపన్యాసం, తిరుపతికి చెందిన శ్రీమతి వరలక్ష్మి హరికథ వినిపించారు. సాయంత్రం శ్రీ ప్రమోద చైతన్యస్వామి శ్రీమద్భగవద్గీతపై ఆధ్యాత్మికోపన్యాసం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి శ్రీమతి కె.విశాలాక్షి అన్నమయ్య విన్నపాలు సంగీత కచేరి నిర్వహించారు.
రథోత్సవంపై జెఈవో సమీక్ష
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం జరుగనున్న రథోత్సవం ఏర్పాట్లపై తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి గురువారం ఆలయాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఎక్కువ మంది భక్తులు రథాన్ని లాగేందుకు వీలుగా తాడును సిద్ధం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాడ వీధుల్లోని నాలుగు మూలల్లో నాలుగు హారతి పాయింట్లు మాత్రమే ఏర్పాటుచేసినట్టు తెలిపారు. భక్తులకు మజ్జిగ, మంచినీరు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి నుండి వచ్చే వాహనాలను చెర్లోపల్లి నుండి చంద్రగిరి మీదుగా శ్రీనివాసమంగాపురానికి వచ్చేలా ట్రాఫిక్‌ మళ్లించాలని, రంగంపేట నుండి వచ్చే వాహనాలను శ్రీనివాసమంగాపురం నుండి చంద్రగిరి మీదుగా తిరుపతికి వెళ్లేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తితిదే డెప్యూటీ ఈవో శ్రీమతి రెడ్డెమ్మ, ఏఈవో శ్రీ లక్ష్మణ్‌ నాయక్‌, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ రఘునాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.